తెలంగాణలో 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారుల బదిలీ
రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేస్తూ ప్రభుత్వం 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది.
Telangana govt


హైదరాబాద్ , 28 అక్టోబర్ (హి.స.)

రాష్ట్రంలో పరిపాలనా వ్యవస్థలో మార్పులు చేస్తూ ప్రభుత్వం 12 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. వివిధ శాఖలకు కొత్త అధికారులను నియమించడంతో పాటు పలువురికి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మార్పుల్లో భాగంగా అటవీశాఖ ప్రత్యేక కార్యదర్శిగా జయేష్ రంజన్ను నియమించారు. విద్యుత్శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతలను వికాస్ రాజ్కు అప్పగించారు.

క్రీడాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా వాణీప్రసాద్ను, పంచాయతీరాజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నవీన్ మిత్తల్ను నియమించారు. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్కు బాధ్యతలు కేటాయించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న దాన కిశోర్ పదవీకాలాన్ని ప్రభుత్వం పొడిగించింది.

ఇక రాహుల్ బొజ్జాకు గిరిజన సంక్షేమశాఖ ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా, రోడ్లు, భవనాల శాఖ కార్యదర్శిగా కె. ఇలంబర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ కమిషనర్గా ఉన్న సర్ఫరాజ్ అహ్మద్కు కోర్ అర్బన్ రీజియన్ ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.

మహిళా సంక్షేమం, ఎస్సీ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా శ్రుతి ఓజాను నియమించారు. వివిధ శాఖల్లో పరిపాలనను మరింత సమర్థవంతంగా నిర్వహించడం, అధికారుల అనుభవాన్ని అవసరమైన విభాగాల్లో వినియోగించుకోవడం వంటి లక్ష్యాలతో ఈ మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఆయా శాఖల బాధ్యతలు స్వీకరించిన అధికారులు ప్రభుత్వ ప్రాధాన్యతలకు అనుగుణంగా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్


 rajesh pande