
అమరావతి:, 29 అక్టోబర్ (హి.స.)
'ఆర్నబ్' తుఫాను తీవ్రత, రాత్రివేళ కురిసిన భారీ వర్షాలు మరియు ఫ్లాష్ ఫ్లడ్ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నేడు (గురువారం) రాష్ట్రంలోని ప్రభావిత జిల్లాల్లో పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కళాశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు.
ఈ మేరకు విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, ఏలూరు, విజయనగరం, శ్రీకాకుళం మరియు కృష్ణా జిల్లాల్లోని అన్ని విద్యాసంస్థలకు సెలవు అమల్లో ఉంటుంది.
తీరం దాటిన తుఫాను క్రమంగా వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, పలు ప్రాంతాల్లో ఏకధాటి వర్షాలు, వాగులు-వంకలు పొంగిపొర్లుతుండటంతో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం మరియు విపత్తు నిర్వహణ శాఖల సూచనల మేరకు ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని విద్యాసంస్థలు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా పాటించాలని, విద్యార్థులు ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని అధికారులు ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi