
హైదరాబాద్ , 29 అక్టోబర్ (హి.స.)
రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మహేశ్వరంలోని ఫైర్ స్టేషన్ సమీపంలో బస్సు, బైకు ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో కేఎస్ తండాకు చెందిన రాహుల్ (22) మృతి చెందాడు.
ఫైర్ స్టేషన్ వద్ద బైకుపై వెళ్తున్న రాహుల్‌ను బస్సు డీ కొట్టారు. ప్రమాద తీవ్రతకు ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. యువకుడి మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. చిన్న వయసులోనే రాహుల్ మరణించడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న మృతుడి బంధువులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఆ మార్గంలో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రోడ్డుపై వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్