చెన్నై పోర్టులో భారీగా చైనా బాణాసంచా పట్టివేత
చెన్నై పోర్టులో భారీ ఎత్తున సాగుతున్న విదేశీ బాణాసంచా అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు.
Fireworks


చెన్నై, 06 అక్టోబర్ (హి.స.)

చెన్నై పోర్టులో భారీ ఎత్తున సాగుతున్న విదేశీ బాణాసంచా అక్రమ రవాణా గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు రట్టు చేశారు.

దీపావళి పండుగ సమీపిస్తున్న వేళ ఎటువంటి ముందస్తు అనుమతులు లేకుండా చైనా నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న భారీ చైనా బాణాసంచా నిల్వలను అధికారులు విజయవంతంగా సీజ్ చేశారు.

పక్కా నిఘా సమాచారంతో పోర్టుకు చేరుకున్న కొన్ని అనుమానాస్పద కంటైనర్లను నిశితంగా పరిశీలించగా ఈ బాగోతం వెలుగులోకి వచ్చింది. పట్టుబడిన బాణాసంచా విలువ మార్కెట్లో రూ.12 కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

సాధారణ తనిఖీలను తప్పుదోవ పట్టించేలా స్టేషనరీ వస్తువులు, మెడికల్ గ్లోవ్స్, వార్డ్రోబ్లు, షూ రాక్స్, హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అంటూ తప్పుడు కస్టమ్స్ డిక్లరేషన్లను సృష్టించి ఈ కంటైనర్లను తరలించినట్లు తేలింది.

అధికారుల కళ్లుగప్పేందుకు కంటైనర్ల ముందు భాగంలో ఇతర అనుమతి ఉన్న సామగ్రిని ఉంచి, లోపల భారీ కార్టన్ల వెనుక చైనా బాణాసంచా బాక్సులను పకడ్బందీగా దాచిపెట్టారు. దేశ భద్రత, పర్యావరణ పరిరక్షణ తో పాటు స్థానిక బాణాసంచా పరిశ్రమల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం విదేశీ బాణాసంచా దిగుమతిపై కఠిన ఆంక్షలు విధించినప్పటికీ.. భారీ లాభాల కోసం స్మగ్లర్లు ఈ దొంగ రవాణాకు తెగబడినట్లు గుర్తించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande