
హైదరాబాద్, 06 అక్టోబర్ (హి.స.) ప్రస్తుత పరిస్థితులలో విమానయాన భద్రతను మరింత పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని రియల్ హీరో సోనూసూద్ అన్నారు. ఇటీవల దుబాయ్ నుంచి ఇజ్రాయెల్కు బయల్దేరిన ఫ్లైదుబాయ్ విమానంలో కోపైలట్ ఘర్షణకు పాల్పడి కెప్టెన్ను గాయపరిచిన ఘటనపై ఆయన స్పందించారు. ఇలాంటి అత్యవసర పరిస్థితుల్లో కాక్పిట్ తలుపు లోపలి నుంచి తెరవలేని పరిస్థితి ఏర్పడితే.. బయట ఉన్న సిబ్బంది సహాయం చేయడానికి ప్రత్యామ్నాయ భద్రతా వ్యవస్థ ఉండాలని సోను సూద్ సూచించారు. ప్రత్యేక అత్యవసర కోడ్ను భద్రంగా సీల్ చేసి, నియమిత సిబ్బంది వద్ద ఉంచే విధానాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. ఆ కోడ్ను సాధారణ పరిస్థితుల్లో ఉపయోగించకుండా, నిజమైన అత్యవసర సమయంలో మాత్రమే కఠినమైన భద్రతా తనిఖీల అనంతరం యాక్సెస్ చేసేలా వ్యవస్థ రూపొందించాలని అన్నారు. అదనపు రక్షణ పొర ప్రాణాలను కాపాడగలదని, ఈ అంశంపై విస్తృత చర్చ జరగాలని సోనూసూద్ అభిప్రాయపడ్డారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు