
హైదరాబాద్, 02 నవంబర్ (హి.స.)
అంతర్జాతీయ పరిణామాలు, ముడిచమురు ధరల తగ్గుదల, కంపెనీల మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాల జోష్ తో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి.
ఉదయం నుంచే లాభాల్లో కొనసాగిన ప్రధాన సూచీలు ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీగా పుంజుకున్నాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 1,233 పాయింట్లు లాభపడి 75,692 వద్ద స్థిరపడింది. అదేవిధంగా ఎన్ఎస్ఈ నిఫ్టీ 387 పాయింట్లు పెరిగి 23,440 వద్ద ముగిసింది. మార్కెట్లో కొనుగోళ్ల జోరు కనిపించడంతో ప్రధాన సూచీలు గణనీయమైన లాభాలను నమోదు చేశాయి.ముడిచమురు ధరల తగ్గుదల…ఇరాన్ యుద్ధాన్ని ముగించేందుకు చర్చలు జరుగుతున్నాయన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. ఈ పరిణామాలతో ముడిచమురు ధరలు దిగివచ్చాయి. చమురు ధరలు తగ్గడం భారత ఆర్థిక వ్యవస్థకు సానుకూల సంకేతంగా భావించిన ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపారు. దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహం నెలకొంది. మరోవైపు ప్రముఖ కార్పొరేట్ సంస్థల త్రైమాసిక ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్లకు అండగా నిలిచాయి. ముఖ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడంతో ఆ సంస్థ షేర్లలో కొనుగోళ్లు పెరిగాయి. రిలయన్స్ షేర్ల లాభాలు మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలోపేతం చేశాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు