
న్యూఢిల్లీ, నవంబర్ 28 (హి.స)
చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న వారు మహిళలకు దక్కాల్సిన ప్రాతినిధ్యాన్ని ఎప్పటికీ అడ్డుకోలేరని ఆయన స్పష్టం చేశారు. సోమవారం (నవంబర్ 30) నుండి డిసెంబర్ 3 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం ప్రధాని మోదీ 'ఎక్స్' (X) వేదికగా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
లోక్సభ స్థానాలను 850 వరకు పెంచుతూ, నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) మరియు 33 శాతం మహిళా రిజర్వేషన్లను అనుసంధానించే రాజ్యాంగ సవరణ బిల్లును ఈ సమావేశాల్లో ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న తరుణంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
నారీ శక్తికి 100 శాతం ఆశీస్సులు ఉన్నాయి
మన నారీ శక్తికి మేము ఒక మాట ఇచ్చాము, దానిని నిలబెట్టుకోవడానికి కట్టుబడి ఉన్నాము. మహిళా రిజర్వేషన్ కోసం నేను ఎంతో కాలంగా పోరాడుతున్నాను. దేశవ్యాప్తంగా ఎందరో మహిళలు వ్యక్తిగతంగా, లేఖల ద్వారా ఈ విషయాన్ని నా దృష్టికి తెచ్చారు. దేశంలోని నారీ శక్తి ఆశీస్సులు మాకు 100 శాతం ఉన్నాయి. ఈ బిల్లుకు అడ్డుగా ఉన్న ప్రతి ఆటంకాన్ని అధిగమిస్తాము. వ్యతిరేకిస్తున్న ఏ పార్టీ కూడా మహిళా రిజర్వేషన్ బిల్లును ఆపలేదు అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. తమ ఆత్మవిశ్వాసం, సంకల్పం చెక్కుచెదరలేదని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర మంత్రులు, ఎన్డీఏ పక్షాల మద్దతు
సవరించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలపడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ హర్షం వ్యక్తం చేశారు. 'నారీ శక్తి వందన్ చట్టం' ద్వారా లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో 33 శాతం రిజర్వేషన్లు త్వరలోనే వాస్తవ రూపం దాల్చనున్నాయని అమిత్ షా పేర్కొన్నారు. దీనివల్ల అన్ని రాష్ట్రాల వాటా సమతుల్యంగా పెరిగి 'వికసిత భారత్' కలను సాకారం చేయడానికి దోహదపడుతుందని పీయూష్ గోయల్ అన్నారు.
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే దీనిని భారత ప్రజాస్వామ్యంలో నూతన స్వర్ణయుగంగా అభివర్ణించారు. టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు, జేడీ(ఎస్) నేత హెచ్.డి. కుమారస్వామి సంయుక్త మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జనాభాకు అనుగుణంగా లోక్సభ స్థానాలు పెరగాలని, కాంగ్రెస్ సహా విపక్షాలన్నీ బిల్లుకు మద్దతు ఇవ్వాలని కోరారు. చివరిసారిగా 1971-72లో డీలిమిటేషన్ జరిగిందని, 50 శాతం సీట్ల పెంపు అవసరమని జేడీ(యూ) నేత సంజయ్ ఝా పేర్కొన్నారు.
బీఎస్పీ అధినేత్రి మాయావతి 33 శాతం మహిళా రిజర్వేషన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూనే, అందులో ఎస్సీ, ఎస్టీ మహిళలకు ప్రత్యేక ఉప-కోటా కేటాయించాలని డిమాండ్ చేశారు.
పార్లమెంట్లో బలాబలాల లెక్కలు:
రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో మూడింట రెండొంతుల (2/3) మెజారిటీ అవసరం. డీఎంకే, ఎన్సీపీ (శరద్ పవార్) వంటి పార్టీలు సవరించిన ప్రతిపాదనలకు సానుకూలత వ్యక్తం చేయడంతో ప్రభుత్వానికి బలం పెరిగింది. 22 మంది ఎంపీలున్న డీఎంకే 50 శాతం సీట్ల పెంపును సమర్థిస్తూనే, తమిళనాడు ప్రస్తుత ప్రాతినిధ్య వాటాకు రక్షణ ఉండాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం అధికార కూటమి మద్దతు 320 నుండి దాదాపు 350 మంది ఎంపీలకు చేరినట్లు అంచనా వేస్తుండగా, మొత్తం 540 మంది సభ్యులు ఓటింగ్లో పాల్గొంటే 360 ఓట్లు అవసరమవుతాయి.
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi