
ముంబై, 13 ఫిబ్రవరి (హి.స.)
నాలుగురోజుల తర్వాత వెండి ధర భారీగా పతనమైంది. ఫిబ్రవరి 9న కిలో వెండిపై రూ.15000 పెరిగి రూ.3,00,000 లకు చేరిన రేటు.. నిన్నటి వరకూ స్థిరంగా కొనసాగింది. నేడు ఏకంగా రూ.20,000 పతనమై కిలో వెండి ధర రూ.2,80,000 (జీఎస్టీ అదనం)కి తగ్గింది. బంగారం ధరలు సైతం భారీగా తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2620 తగ్గి రూ.1,55,780కి దిగొచ్చింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.2400 తగ్గి రూ.1,42,800కి చేరింది. 18 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1960 తగ్గి రూ.1,16,840వద్ద కొనసాగుతోంది. తగ్గిన ధరలకు జీఎస్టీ, తరుగు అదనంగా ఉంటాయి. నిన్న, ఈరోజు కలిపి బంగారం ధర 10 గ్రాములపై రూ.3500 నుంచి రూ.3820 వరకూ తగ్గింది. నాలుగు రోజుల్లో పెళ్లిళ్లు మొదలు కానున్న సమయంలో బంగారం, వెండి రేట్లు ఈ స్థాయిలో తగ్గడంతో కొనుగోలు దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ రోజు (ఫిబ్రవరి 13న) ఉదయం 10:00 గంటల సమయంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.1,55,780కి చేరింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,620 రూపాయలు తగ్గింది. ఇక, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,42,800కి చేరింది (Live gold rates). నిన్నటి ధరతో పోల్చుకుంటే 2,400 రూపాయలు తగ్గింది. ఇక, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.1,55,930కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.1,42,950కి చేరుకుంది.
ఇక, వెండి ధర కూడా భారీగా తగ్గింది. (Silver Rates Live). మళ్లీ రూ.3 లక్షల మార్క్ దిగువకు చేరుకుంది. నిన్నటి ధరతో పోల్చుకుంటే కిలోకు రూ.15 వేల మేర పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.8 లక్షలుగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2.8 లక్షలుగా ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV