
ఢిల్లీ, 21 ఫిబ్రవరి (హి.స.)
డోనాల్డ్ ట్రంప్ విధించిన టారిఫ్స్ అమెరికా సుప్రీం కోర్టు కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. సుంకాలు విధించే అధికారం అసలు అధ్యక్షుడికి ఉండబోదని, ఇప్పటి వరకు వసూలు చేసిన వాటిని తిరిగి ఇచ్చేయాలని ఆదేశాలు జారీ చేసింది సుప్రీం కోర్టు. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భేఖాతరు చేస్తున్నారు.
ఎప్పటి లాగే ఇండియా టారిఫ్స్ చెల్లించాల్సిందే !
టారిఫ్స్ కు వ్యతిరేకంగా సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రభావం ఇండియా-US ట్రేడ్ ఒప్పందంపై ఉండబోదని తాజాగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ( Donald Trump ) క్లారిటీ ఇచ్చారు. ఈ ఒప్పందంలో ఎలాంటి మార్పు ఉండబోదని కుండ బద్దలు కొట్టి చెప్పారు. యధావిధిగా అమెరికాకు ఇండియా సుంకాలు చెల్లిస్తుందని కీలక ప్రకటన చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గొప్ప జెంటిల్మెన్ అంటూ వ్యాఖ్యానించారు. తన వ్యతిరేకుల కంటే చాలా తెలివైన వ్యక్తి అని కొనియాడారు. కానీ మనల్ని ఆయన మోసం చేస్తున్నారని... అందుకే డీల్ చేసుకున్నట్లు తెలిపారు. అమెరికాకు ఇండియా టారిఫ్స్ చెల్లిస్తుంది... కానీ ఇండియాకు మాత్రం అమెరికా చెల్లించబోదని మరో బాంబు పేల్చారు ట్రంప్.
అటు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొంతమంది న్యాయమూర్తులు విదేశీ ప్రయోజనాలకు ప్రభావితం అయ్యారని షాకింగ్ కామెంట్స్ చేశారు. కోర్టులోని కొంతమంది సభ్యులను చూసి సిగ్గు పడుతున్న అంటూ ఫైర్ అయ్యారు. వాణిజ్య ఎజెండా నుంచి వెనక్కి తగ్గేది లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇంకా బలమైన పద్ధతులు తనకు తెలుసు అని వార్నింగ్ కూడా ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అన్ని దేశాలపై పది శాతం అదనంగా సుంకం విధించేందుకు కూడా ట్రంప్ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV