
హైదరాబాద్, 27 ఫిబ్రవరి (హి.స.)జగన్ హయాంలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేశారు. వ్యవసాయంలో జాతీయ జీడీపీలో ఏపీకి పదిశాతం వాటా ఉందని ప్రస్తావించారు. ఇవాళ(శుక్రవారం) వ్యవసాయ రంగం బడ్జెట్పై అసెంబ్లీలో ముఖ్యమంత్రి మాట్లాడారు. పంచసూత్రాలు, అగ్రిటెక్ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి చర్యలు చేపట్టామని తెలిపారు. డిమాండ్ ఉన్న పంటలను పండించేలా రైతులకు అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించటం ద్వారా పంటలకు మంచి ధర లభిస్తుందని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రతి ఏడాది రూ.13,722కోట్లను వ్యవసాయంలో ఉచిత విద్యుత్కు ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. భూసారం పెంచేందుకు సూక్ష్మ పోషకాలను రైతన్నలకు పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో అన్నదాత సుఖీభవం కింద రూ.7వేలు ఇస్తే... కూటమి ప్రభుత్వంలో రూ.14వేలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. రైతు భరోసా పేరు చెప్పి జగన్ హయాంలో ప్రభుత్వం నుంచి వచ్చే మిగతా ప్రోత్సాహకాలూ కూడా ఆపివేసిందని ఆగ్రహించారు. ధాన్యం కొనుగోళ్లకు రూ.10వేల కోట్లకు పైగా అన్నదాతలకు ఇచ్చామని చెప్పుకొచ్చారు. రూ.1,670 కోట్ల ధాన్యం బకాయిలు తాము చెల్లించామని స్పష్టం చేశారు.
రైతన్నలు ఆత్మహత్యలు చేసుకోకుండా చర్యలు చేపట్టామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్నదాతల ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని అన్నారు. కృత్తిమ మేథ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని వివరించారు. కృత్తిమ మేథ అందించే వ్యవసాయ శాస్త్రవేత్తలను రైతుల కోసం నియమిస్తామని తెలిపారు. 8వేలకు పైగా గ్రామాల్లో 15లక్షల మంది రైతన్నలు ప్రకృతి సేద్యం చేస్తున్నారని చెప్పుకొచ్చారు. 40లక్షల మంది అన్నదాతలను ప్రకృతి సేద్యం వైపు మళ్లించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని వ్యాఖ్యానించారు.
రాయలసీమ ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉందని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 20లక్షల హెక్టార్లనూ.. 40లక్షల హెక్టార్లకు పెంచుతామని వివరించారు. ఉద్యాన పంటల దిగుబడులను 400మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామని తెలిపారు. రూ.30వేల కోట్లతో ప్రత్యేక ప్రాజెక్టు ప్రారంభిస్తామని చెప్పుకొచ్చారు. మౌలిక వసతుల కోసం రూ.70వేల కోట్లు ఖర్చు చేస్తామని, లక్ష కోట్ల రూపాయలతో హార్టికల్చర్ హబ్ అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్