
ఢిల్లీ, 14మార్చి (హి.స.) : మహిళలకు నెలసరి రుతుక్రమ సెలవులు ఇవ్వాలని చట్టం చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని జస్టిస్ సూర్యకాంత్ అభిప్రాయపడ్డారు. అలాంటి చట్టబద్ధ నిబంధనలు ఉంటే మహిళలకు ఉద్యోగాలు ఎవరూ ఇవ్వరని అన్నారు. ‘యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. అలాంటి చట్టాన్ని ఆమోదిస్తే వారు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. దీన్ని ఓ బెడదగా భావిస్తారు’ అని చెప్పారు. తాము పురుషులకన్నా తక్కువన్న భావన కూడా మహిళా ఉద్యోగుల్లో కలుగుతుందని తెలిపారు. తప్పనిసరిగా నెలసరి సెలవులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించాలన్న వాజ్యంపై ఆయన ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.
. ఋతుక్రమ సమయంలో విద్యారి్థనులు, మహిళా ఉద్యోగులకు సెలవు నియమాలను రూపొందించాలని రాష్ట్రాలకు దిశానిర్దేశం చేయాలని కోరుతూ న్యాయవాది శైలేంద్రమణి త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు శుక్రవారం విచారించింది. ఈ చట్టం శ్రామిక మహిళల్లో భయాన్ని లేదా వారు పురుషుల కంటే తక్కువనే అభిప్రాయాన్ని సృష్టిస్తుందని అభిప్రాయపడింది. ‘ఒక విషయం పట్ల అవగాహన, సున్నితత్వాన్ని సృష్టించడం భిన్నంగా ఉంటుంది.
రుతుక్రమ సెలవులను తప్పనిసరి చేస్తూ ఒక చట్టాన్ని తీసుకువచ్చిన క్షణం నుంచే యాజమాన్యాలు మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోరు. యజమానుల మనస్తత్వం మీకు తెలియదు. వారు మహిళలను తక్కువ చేసి మాట్లాడతారు. ఋతుస్రావం వారికి జరుగుతున్న ‘చెడు’గా పరిగణిస్తారు’అని చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ వ్యాఖ్యానించారు.
అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో మహిళా విద్యార్థులకు నెలసరి సెలవులు 2013లో కేరళ ప్రభుత్వం మంజూరు చేసిందని సీనియర్ న్యాయవాది ఎమ్.ఆర్.శంషాద్ గుర్తు చేశారు. కొన్ని ప్రైవేట్ కంపెనీలు ఇలాంటి సడలింపులు ఇచ్చాయని చెప్పుకొచ్చారు. అయితే, ‘అవి స్వచ్ఛందంగా తీసుకున్న చర్యలు. మీరు తప్పనిసరి చట్టం అని చెప్పిన వెంటనే, ఎవరూ వారికి ఉద్యోగాలు ఇవ్వరు. న్యాయవ్యవస్థలో లేదా ప్రభుత్వ ఉద్యోగాలలో వారిని తీసుకోరు. ఇక ఇంట్లో కూర్చోవాలని చెబుతారు. వారి కెరీర్ ముగిసిపోతుంది.’అని ప్రధాన న్యాయమూర్తి అన్నారు.
8
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ