భారత్ ఎప్పుడూ శాంతియుత పరిష్కారాన్నే కోరుకుంటుంది: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చితాభిప్రాయమని అన్నారు.
National


హైదరాబాద్, 02 మార్చి (హి.స.)పశ్చిమాసియాలో ప్రస్తుత పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. దౌత్యం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలన్నదే ఇండియా నిశ్చితాభిప్రాయమని అన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని పేర్కొన్నారు. భారత్లో పర్యటిస్తున్న కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నేతో కలిసి మీడియా సంయుక్త సమావేశంలో ప్రధాని మాట్లాడారు.

ఉగ్రవాదం విసురుతున్న సవాళ్లను మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉగ్రవాదం, తీవ్రవాదం, రాడికలైజేషన్ మనకే కాక ప్రపంచ దేశాలకు సవాళ్లు విసురుతున్నట్టు చెప్పారు. దీనిపై సమష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి బెదిరింపులను సమర్ధవంతంగా ఎదుర్కొని ప్రపంచ శాంతి, సుస్థిరత కోసం దేశాల మధ్య పరస్పర సహకారం అవసరమని అన్నారు. ప్రపంచవ్యాప్త ఉద్రిక్తతల విషయంలో భారత్ వైఖరి ఎప్పుడూ ఒకటేనని, శాంతి, సుస్థిరత కీలకమని, రెండు ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే శాంతి మరింత పటిష్టమవుతుందని అన్నారు. ప్రపంచ దేశాల్లో భారతీయులు ఎక్కడున్నా వారితో ఎప్పుడూ సంప్రదింపులు జరుపుతూ వారి భద్రతకు భారత్ కట్టుబడి ఉంటుందని చెప్పారు.

అమెరికా మద్దతుతో ఇజ్రాయిల్ గత శనివారంనాడు ఇరాన్ రాజధాని టెహ్రాన్లోని 30 చోట్ల దాడులు జరిపింది. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం నేత అయతుల్లా అలీ ఖమేనీ మరణించడంపై ఇరాన్ ప్రతిదాడులకు దిగింది. ఇజ్రాయెల్, అరబ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణులు, డ్రోన్ దాడులతో విరుచుకుపడింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ శాంతియుత పరిష్కారాని పిలుపునిచ్చారు. కాగా, కెనడా ప్రధాని మార్క్ కార్నీ భారత్ పర్యటనకు విచ్చేయడంతో విద్యుత్, టెక్నాలజీ రంగాల్లో సహకరించుకోవాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. గ్లోబల్ బయోఫ్యూయల్ కూటమిలో చేరాలని కూడా కెనడా నిర్ణయం తీసుకుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande