
అమరావతి, 22 మార్చి (హి.స.):ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి. మార్చి 25వ తేదీతో ఇవి ముగియనున్నాయి. ఈ ఇంటర్మీడియట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి 23వ తేదీ సోమవారం నుంచి ప్రారంభించనున్నారు. అందుకోసం ప్రభుత్వం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ పరీక్షల ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో వెలువరించేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఇంటర్మీడియట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా వెల్లడించారు.
ఇప్పటికే ఇంటర్మీడియట్ ప్రధాన పరీక్షలన్నీ మార్చి 18వ తేదీతోనే ముగిశాయని ఆయన గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో మార్చి 23 నుంచి జవాబు పత్రాల మూల్యాంకనం చేపట్టనున్నట్లు వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో ఈ మూల్యాంకనం కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో లెక్చరర్కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తారు.మూల్యాంకనం చేసే జూనియర్ లెక్చరర్లకు విద్యా శాఖ ఇప్పటికే మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మూల్యాంకనం చేసేటప్పుడు చేతిరాత బాగాలేదనే కారణంతో విద్యార్థుల మార్కులు తగ్గించొద్దని జారీ చేసిన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. విద్యార్థుల రాసిన సమాధానాల ఆధారంగానే మూల్యాంకనం చేయాలని సూచించింది. జవాబు పత్రంలోని సమాధానాలు పూర్తిగా చదవకుండా మార్కులు ఇవ్వవద్దంది.
ఈ మూల్యాంకనం పూర్తయిన తిరిగి పరిశీలించి.. మార్కులు స్పష్టంగా వేయాలని సూచించింది. ఈ మూల్యాంకనంలో పొరపాట్లు చేసే భారీగా జరిమానాలు ఉంటాయని హెచ్చరించింది. పేపరు మూల్యాంకనం చేసిన వారు పొరపాట్లు చేస్తే.. రూ. 3 వేలు నుంచి రూ.7,500 వరకూ, పరిశీలించిన వారికి రూ. 2 వేలు నుంచి రూ. 3,750 వరకు జరిమానాలు విధిస్తామని తెలిపింది. మార్కుల్లో భారీ వ్యత్యాసం వస్తే మూల్యాంకనం నుంచి డీబార్ చేస్తామని ఇంటర్మీడియట్ బోర్డు ఉన్నతాధికారులు హెచ్చరించారు.
రాష్ట్రంలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమయ్యాయి. ఇంటర్ ఫస్ట్, సెకండీయర్ పరీక్షలకు మొత్తం 10,57,312 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్