నెల్లూరుకి మరో భారీ పరిశ్రమ: ఎంపీ వేమిరెడ్డి
త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు
MP


నెల్లూరు, 22 మార్చి (హి.స.)త్వరలోనే నెల్లూరుకి భారీ పరిశ్రమ రాబోతోందని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ పరిశ్రమ ద్వారా నెల్లూరు రూరల్లో ఉద్యోగ అవకాశాలు రానున్నాయని పేర్కొన్నారు. ఈరోజు(ఆదివారం) నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల్లో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో యువతకు భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నెల్లూరులో చాలా అభివృద్ధి పనులు చేపట్టామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులను పూర్తి చేయడంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్టైలే వేరని ప్రశంసించారు. ఈరోజు పడారుపల్లిలో అభివృద్ధి పనుల్లో మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. పడారుపల్లిలో జరిగిన ఈ అభివృద్ధి కార్యక్రమానికి వేలాది మంది ప్రజలు హాజరయ్యారు. ఈ ప్రాంతంలో తిరునాళ్ల వాతావరణాన్ని తలపించేలా టీడీపీ నేత గిరిధర్ రెడ్డి ఏర్పాట్లు చేశారు.

కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి పనుల జాతర ప్రారంభమైందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.613 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేశామని వెల్లడించారు. చాలావరకు ఈ పనులు పూర్తి అయ్యాయని తెలిపారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రూ.27కోట్లతో 240 అభివృద్ది పనులు పూర్తి చేశామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు. అభివృద్ధి పనుల జాతర ఇంకా కొనసాగుతోందని, ఈ పనులను టీడీపీ నేత గిరిధర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారని చెప్పుకొచ్చారు. అభివృద్ధి పనుల విషయంలో గిరిధర్ రెడ్డి కృషి చాలా ఉందని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అన్ని ప్రాంతాల్లోనూ ఒకేసారి ప్రజలతో ప్రారంభోత్సవాలు చేస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల ప్రాధాన్యం పెరిగిందని వివరించారు. ఈ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande