
హైదరాబాద్, 22 మార్చి (హి.స.)
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం
ధ్వంధ్వ వైఖరితో వ్యవహరిస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. హైడ్రా పేరుతో పేదల ఇళ్లను కూల్చివేస్తూ ఎంఐం పార్టీకి చెందిన నేతల ఆక్రమణలను మాత్రం వదిలేస్తోందని ధ్వజమెత్తారు. తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాధ్ ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్పింగ్ ను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసిన బండి సంజయ్ ఈ ఇంటర్వ్యూలో రంగనాధ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ గరీంబోంకో హటావో- ఒవైసీకి బచావో అన్న చందంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. పేదల కోసం బఫర్ జోన్లు, ఒవైసీ కోసం కంఫర్ట్ జోన్లు, పేదలకు ఫఉల్ ట్యాంక్ లెవల్ (FTL), ఒవైసీకి మాత్రం ఫుల్ థ్యాంక్ లేవల్ అనేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ లాజిక్ ఎలా ఉందంటే విద్యార్థులు అక్రమ కాలేజీలో చదివితే అది సామాజిక కోణం, అదే పేదల ఇళ్లు మాత్రం ఆక్రమణలు అంటూ కూల్చేస్తున్నారని దుయ్యబట్టారు.
అధికారిక లెక్కల ప్రకారం దాదాపు 200లకు పైగా పేద కుటుంబాల ఇళ్లపైకి మెరుపు వేగంతో కదిలిన హైడ్రా బుల్డోజర్లు సల్కం చెరువు ఎన్టీఎల్ లో ఉన్న ఓవైపీ కాలేజీ విషంలో మాత్రం జాప్యం చేస్తోందన్నారు. ప్రధాని మోడీ పీఎంఏవై ద్వారా పేదలకు గౌరవప్రదమైన నివాసాలు నిర్మిస్తుంటే కాంగ్రెస్ మాత్రం బుల్డోజర్లను పంపిస్తోందని విమర్శించారు. చట్టం రజాకార్ వారసుల కోసం వంగి, పేదలపై మాత్రం విరుచుకుపడితే అ దిపాలన కాదని బలహీనమైన సమర్ధన మాత్రమేనని విమర్శించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు