
వరంగల్, 22 మార్చి (హి.స.)
ప్రజాపాలనలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం నియోజకవర్గ పరిధిలోని 30,59వ డివిజన్లలో సుమారు రూ.85 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా సంబంధిత కాంట్రాక్టర్లకు పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని స్పష్టం చేశారు. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ.. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ అని, ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఆశించిన ఫలితాలు సాధ్యమవుతాయని తెలిపారు. నియోజకవర్గ పరిధిలో సీసీ రోడ్లు లేని కాలనీలను పూర్తిగా అభివృద్ధి చేయడంపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. ఇప్పటివరకు సుమారు 80 శాతం పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని వెల్లడించారు. పశ్చిమ నియోజకవర్గాన్ని సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లడం తన ప్రధాన లక్ష్యమని, ప్రతి వర్గానికి ప్రయోజనం చేకూరేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు