ఎలక్ట్రిక్ వాహనాలపై 20శాతండిస్కౌంట్.. షో రూములకు క్యూ కడుతున్న ప్రభుత్వ ఉద్యోగులు
హైదరాబాద్, 26 మార్చి (హి.స.) పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సంక్షోభానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఈవీ కంపెనీల నుంచే 20 శ
Electric vehicles


హైదరాబాద్, 26 మార్చి (హి.స.)

పర్యావరణ పరిరక్షణతో పాటు ఇంధన సంక్షోభానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) వినియోగాన్ని ప్రోత్సహిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఈవీ కంపెనీల నుంచే 20 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. సెక్రెటేరియట్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రారంభించగా.. ఉద్యోగులు ఈవీలను కొనుగోలు చేసేందుకు షోరూంలకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే మహీంద్రా ఎలక్ట్రిక్స్, ఏథర్ ఎనర్జీ, ఓలా, గ్రావిటన్ మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు ఉద్యోగులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వడానికి ముందుకు వచ్చాయి. ప్రభుత్వం మరిన్ని కంపెనీలతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తోందని అధికారులు తెలిపారు.

ఈవీ పాలసీని సమర్థవంతంగా అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకమని ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ అనేక సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఈవీలకు ఉద్యోగులే బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని ఆయన ఆశిస్తున్నారు. కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు సంప్రదాయ ఇంధనాలపై ఆధారపడడాన్ని తగ్గించడమే ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. అందుకే ప్రభుత్వం ఈవీలను ప్రోత్సహిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులను 100 శాతం మినహాయిస్తూ ప్రోత్సాహం అందిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఇప్పటివరకు లక్షకు పైగా ఈవీ వాహనాలు రిజిస్టర్ కాగా, సుమారు రూ.925 కోట్ల మేర ఆదాయం

వదులుకున్నప్పటికీ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ ఏడాది చివరి వరకు ఈవీలపై రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు ఉండదు. కాబట్టి పెద్ద ఎత్తున ప్రజలు ఈవీలు కొనాలని సర్కారు సూచిస్తోంది.

పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో పెట్రోల్, డీజిల్ కొరత తలెత్తడంతో బంకుల వద్ద భారీ క్యూలు కనిపిస్తున్నాయి. చాలా మంది ఫ్యూయల్ దొరక్క ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు చాలా బంకులు మూసేసి కనిపిస్తున్నాయి. వాహనదారులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఎలక్ట్రిక్ స్కూటర్లు మాత్రం రయ్ రయ్మని పరుగులు పెడుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు ఎలక్ట్రిక్ వాహనాలవైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ఖర్చుతో ప్రయాణం, నిర్వహణ సౌలభ్యం కారణంగా ఈవీలపై ఆసక్తి పెరిగింది. డిస్కౌంట్ ప్రకటనతో షోరూమ్ల వద్ద కొనుగోలుదారుల రద్దీ కూడా పెరిగినట్లు సమాచారం. ప్రస్తుతం 4 కంపెనీలు మాత్రమే 20 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వడానికి అంగీకరించగా.. మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని ఉద్యోగులు కోరుతున్నారు. ఎక్కువ బ్రాండ్లు చేరితే ఎంపికలకు అవకాశంతో పాటు పోటీ వాతావరణం ఏర్పడి మరింత లాభం కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande