
హైదరాబాద్, 08 మార్చి (హి.స.)గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి హాకీ స్టేడియంలో FIH హాకీ మహిళల ప్రపంచ కప్ క్వాలిఫైయర్స్ 2026 టోర్నమెంట్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇవాళ రాత్రి 7:00 గంటలకు ఈ టోర్నీని సీఎం ప్రారంభించనున్నారు. ఇప్పటికే మహిళల హాకీ వరల్డ్ కప్ 2026 క్వాలిఫైయింగ్ టోర్నీ షెడ్యూల్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోటీలో మొత్తం ఎనిమిది జట్లు రెండు గ్రూపులుగా విభజించబడ్డాయి.
ప్రతి గ్రూపులో నాలుగు జట్లు పాల్గొంటాయి. లీగ్ దశ మ్యాచ్లు ఇవాళ(మార్చి 8) నుంచి ప్రారంభం కానున్నాయి. అలానే ఫైనల్ మ్యాచ్ మార్చి 14 న జరగనుంది. ఇక పూల్–ఏలో ఇంగ్లాండ్, కొరియా, ఇటలీ, ఆస్ట్రియా జట్లు ఉన్నాయి. పూల్–బిలో భారత్, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పోటీపడతాయి. భారత జట్టు మార్చి 8 న ఉరుగ్వేతో, మార్చి 9 న స్కాట్లాండ్తో, మార్చి 11న వేల్స్తో లీగ్ దశలో తలపడనుంది. లీగ్ దశలో అగ్రస్థానాల్లో నిలిచిన జట్లు సెమీ ఫైనల్కు అర్హత సాధిస్తాయి. మార్చి 13 న సెమీ ఫైనల్స్ జరగగా, మార్చి 14 న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు.
మరోవైపు తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న మెగా రైతు మేళాలో మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. రైతుల సందర్శనార్థం ఏర్పాటు చేసిన స్టాళ్లను మంత్రులు పరిశీలించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున మహిళా రైతులు పాల్గొన్నారు. వ్యవసాయ రంగంలో అద్భుత విజయాలు సాధించిన మహిళామణులను మంత్రి తుమ్మల ప్రత్యేకంగా అభినందించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పాల్గొని, నూతన ఆవిష్కరణలు, కొత్త వ్యవసాయ పద్ధతులు గురించి తెలుసుకోవాలని రైతులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్