
చెన్నై, 11 ఏప్రిల్ (హి.స.)
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ తన రాజకీయ రంగ ప్రవేశానికి ముందు నటిస్తున్న చివరి చిత్రం 'జన నాయగన్' చుట్టూ ఇప్పుడు పెను సంచలనం రేగుతోంది. ఈ సినిమా ఇంకా థియేటర్లలో విడుదల కాకముందే, 5 నిమిషాల సీన్, ఓ పాటకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పైరసీ వెబ్సైట్లలో లీక్ అవ్వడం చిత్ర పరిశ్రమను షాక్కు గురిచేసింది. దీంతో వెంటనే అలర్ట్ అయిన మూవీ టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటుగా.. నెటిజన్లకు హెచ్చిరికలు జారీ చేశారు. ఇక ఈ విషయంపై సినీ సెలబ్రిటీలు స్పందిస్తూ.. తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తాజాగా, దీనిపై దిగ్గజ నటుడు కమల్ హాసన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ లీక్పై స్పందిస్తూ కమల్ హాసన్ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. జన నాయగన్ సినిమా లీక్ అవ్వడం ఒక ప్రమాదం కాదు, ఇది వ్యవస్థనే లీక్ చేసింది. సరైన ప్రక్రియ సకాలంలో జరిగి ఉంటే, మనం ఈ పరిస్థితిలో ఉండేవాళ్ళం కాదు.
సెన్సార్ బోర్డు (CBFC) సర్టిఫికేషన్ ఇవ్వడంలో చేసిన జాప్యం వల్లే పైరసీకి అవకాశం దొరికింది. చట్టబద్ధంగా సినిమా విడుదల ఆగిపోయినప్పుడు, ఇలాంటి అక్రమ మార్గాలు పుట్టుకొస్తాయి అని ఆయన పేర్కొన్నారు. పైరసీ అనేది కేవలం రాజకీయం కాదని, ఇది వందలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణుల కష్టాన్ని దెబ్బతీసే చర్య అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..