
బెంగళూరు, 17 ఏప్రిల్ (హి.స.)మన శరీర ఆరోగ్యానికి నీరు ఎంతో ముఖ్యమైనది. సరైన మోతాదులో నీరు తాగడం వల్ల శరీరం సక్రమంగా పనిచేస్తుంది. సాధారణంగా రోజుకు 8 గ్లాసుల నీరు అనే నియమం అందరికీ తెలిసిందే. అయితే, ప్రతి వ్యక్తికి అవసరమైన నీటి మోతాదు ఒకేలా ఉండదు అని ఆరోగ్య నిపుణులు బెంగళూరుకు చెందిన డా. చిలకముడి పుల్లా రావు చెబుతున్నారు.
ఆరోగ్యంగా ఉండటానికి నీరు కీలకమని, అయితే ప్రతి ఒక్కరూ ఒకే పరిమాణంలో నీరు తాగాల్సిన అవసరం లేదని తెలుసుకోవాలి. మన శరీరంలో 60 నుండి 70 శాతం వరకు నీరు ఉంటుంది. కణాల పనితీరు నుండి జీర్ణక్రియ వరకు ప్రతిదానికీ నీరు అవసరం. కానీ, అసలు రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలనే విషయంలో చాలామందికి సందేహాలు ఉంటాయి. నీటి వినియోగం వ్యక్తి వయస్సు, లింగం, జీవనశైలిపై ఆధారపడి ఉంటుంది. ఎవరెవరు ఎంత తాగాలి..? అనే వివరాల్లోకి వెళితే..
వ్యక్తి వయస్సు, బరువు, శారీరక శ్రమ, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలపై నీటి అవసరం ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, వేసవి కాలంలో ఎక్కువగా చెమట పడటంతో శరీరం నుంచి నీరు కోల్పోతుంది. అందువల్ల ఆ సమయంలో ఎక్కువ నీరు తాగడం అవసరం.
పురుషులు రోజుకు సుమారు 3 నుంచి 3.7 లీటర్లు, మహిళలు 2 నుంచి 2.7 లీటర్ల వరకు నీరు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఇది కేవలం సాధారణ మార్గదర్శకం మాత్రమే. వ్యాయామం చేసే వారు లేదా బహిరంగ పనులు చేసే వారు మరింత నీరు తీసుకోవాలి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు సాధారణం కంటే ఎక్కువ నీరు అవసరం. రోజుకు 10 నుండి 12 గ్లాసుల నీరు తాగడం వల్ల తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా ఉంటారు. పిల్లలకు 6 నుండి 8 కప్పుల నీరు వారి ఎదుగుదల, హైడ్రేషన్ కోసం అవసరం.
నీరు తాగడానికి సరైన సమయం, పద్ధతి కూడా ముఖ్యం. ఉదయాన్నే నిద్ర లేవగానే 2 గ్లాసుల నీరు తాగడం వల్ల శరీరంలోని అవయవాలు చురుగ్గా పనిచేస్తాయి. విషతుల్యాలు బయటకు వెళ్తాయి. జీర్ణక్రియ మెరుగుపడటానికి భోజనం చేయడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీరు తాగడం మంచిది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్నప్పుడు లేదా ఎండలో తిరిగేటప్పుడు శరీరానికి ఎక్కువ నీరు అందించాలి.
మీకు తరచుగా గొంతు ఎండిపోవడం, నోరు ఆరిపోవడం లేదా మూత్రం పసుపు రంగులో రావడం వంటివి జరిగితే, మీ శరీరం నీటి కొరతతో బాధపడుతోందని అర్థం. ఇటువంటి సమయంలో వెంటనే నీరు తాగాలి. నీరు అమృతం వంటిది. కానీ, దానిని సరైన పద్ధతిలో తీసుకోవాలి.
ముఖ్యంగా కిడ్నీ లేదా గుండె జబ్బులు ఉన్నవారు నీరు ఎక్కువగా తాగితే ఆ అవయవాలపై భారం పడే అవకాశం ఉంటుంది, కాబట్టి వారు వైద్యుల సూచనలు పాటించాలి. దాహం వేసే వరకు ఆగకుండా, రోజంతా కొద్దికొద్దిగా నీరు తాగుతూ ఉండటం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV