
నంద్యాల, 19 ఏప్రిల్ (హి.స.)
నంద్యాల జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ నీడలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. నంద్యాల మండలం కొత్తపల్లి గ్రామ శివారులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడిని బండిఆత్మకూరు మండలానికి చెందిన కరీముల్లాగా పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారం ప్రకారం.. కరీముల్లా శనివారం రాత్రి లేదా ఆదివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగుల చేతిలో హతమయ్యాడు. కొత్తపల్లి గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో కరీముల్లాను అడ్డగించిన దుండగులు, వేటకొడవళ్లతో దాడి చేసి ప్రాణాలు తీసినట్లు తెలుస్తోంది. రక్తపు మడుగులో పడి ఉన్న మృతదేహాన్ని చూసిన గ్రామస్థులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే నంద్యాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి, పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్లూస్ టీం మరియు డాగ్ స్క్వాడ్ సాయంతో పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. హత్యకు పాత కక్షలు కారణమా? లేక వ్యక్తిగత లేదా ఆర్థిక లావాదేవీల వల్ల ఈ ఘాతుకానికి పాల్పడ్డారా? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. హత్య జరిగిన తీరును బట్టి ఇది ముందస్తు ప్రణాళికతో జరిగిన దాడిలా కనిపిస్తోందని ప్రాథమికంగా నిర్ధారించారు. అనుమానితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. కరీముల్లా ఫోన్ కాల్ డేటాను కూడా విశ్లేషిస్తున్నట్లు సమాచారం. ఈ హత్యతో బండిఆత్మకూరు, కొత్తపల్లి గ్రామాల్లో భయాందోళన నెలకొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV