
జగిత్యాల, 02 ఏప్రిల్ (హి.స.)
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని
జాతీయ రహదారిపై ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్ద అర్ధరాత్రి సమయంలో ఒక లారీ మృత్యుశకటంగా మారి ముగ్గురి ప్రాణాలను బలిగొంది. ఈ ప్రమాదంతో జాతీయ రహదారి రక్తసిక్తమవ్వగా, ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మపురి జాతీయ రహదారిపై ఒక లారీ మరో వాహనాన్ని ఓవర్టేక్ చేయబోయి, ఎదురుగా వస్తున్న బైక్ను బలంగా ఢీకొట్టింది. ఆపై పక్కనే వెళ్తున్న ఆటోను కూడా అతివేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి బైక్పై ప్రయాణిస్తున్న ధర్మపురికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న పలువురు హనుమాన్ భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ మేరకు సమాచారం అందుకున్న ధర్మపురి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, 108 వాహనంలో క్షతగాత్రులను జగిత్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని ధర్మపురికి చెందిన మాదాసు అమర్నాథ్, పడాల రిశ్వంత్లుగా గుర్తించారు. మరో మృతుడు జగిత్యాలకు చెందిన కోల మయన్ అని సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..