
హైదరాబాద్, 21 ఏప్రిల్ (హి.స.)
ప్రముఖ జానపద గాయని, తెలంగాణ ఉద్యమ గళం మధుప్రియ మరోసారి తన రాజకీయ వైఖరిని కుండబద్దలు కొట్టారు. మాజీ సీఎం కేసీఆర్కు తాను ఎల్లప్పుడూ మద్దతుగా నిలుస్తానని, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరినా కాంగ్రెస్ ప్రభుత్వం కోసం పాటలు పాడనని స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో బీఆర్ఎస్ నిర్వహించిన కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆమె, తన గాత్రంతో సభికులను ఉర్రూతలూగించడమే కాకుండా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
జగిత్యాల సభలో మధుప్రియ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తన పాటలతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపారు. ఈ సందర్భంగా మళ్లీ బాపు రావాలి.. మళ్లీ కేసీఆర్ పాలన రావాలి అంటూ ఆమె పాడిన పాట సభలో మార్మోగింది. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ అంటే ఒక ఎమోషన్ అని, రాష్ట్ర సాధనలో ఆయన పాత్రను ఎవరూ మరువలేరని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్తో తనకు విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi