
హైదరాబాద్, 22 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో మంగళవారం అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగారు. దీంతో బస్ డిపోల్లో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. డిపోల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సమ్మెతో రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పలు చోట్ల ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నారు.
కార్మికుల సమ్మెతో పెద్దపల్లిలో 150 బస్సులు డిపోనకే పరిమితమయ్యాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఆర్టీసీ డిపో ఎదుట కార్మికులు ఆందోళన చేపట్టారు. మహబూబ్‌నగర్‌లో 112 బస్సులు డిపోనకే పరిమితం కాగా.. ప్రయాణికుల కోసం 16 విద్యుత్ బస్సులను అధికారులు ఏర్పాటు చేశారు.
మరోవైపు కార్మికుల సమ్మెపై ప్రభుత్వం సానుకూలంగా ఉందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. కొన్ని సంఘాలు నిజాలను విస్మరించి కార్మికులను తప్పుదోవ పట్టిస్తున్నాయని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు