రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత.. వాహనదారుల ఇబ్బందులు..
రాష్ట్రంలో మళ్లీ ఇంధన కొరత.. వాహనదారుల ఇబ్బందులు..
Petrol


నిజామాబాద్, 27 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలో మరోసారి ఇంధన కొరత వినియోగదారులను ఇబ్బందులపాలు చేస్తోంది. నిల్వలు సమృద్ధిగా ఉన్నాయని పౌరసరఫరాల శాఖ స్పష్టత ఇచ్చినా పలు జిల్లాల్లో పెట్రోల్ బంకుల్లో మాత్రం నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఈ ఇంధన సమస్య ఇప్పటి వరకు పొరుగు రాష్ట్రం ఏపీలోనే ఉండగా తాజాగా తెలంగాణలోనూ క్షేత్రస్థాయిలో ఇదే పరిస్థితి కనిపిస్తుండటం వాహనదారులను ఆందోళనలోకి నెడుతోంది. పలు చోట్ల పెట్రోల్ బంక్ల వద్ద నో స్టాక్ అనే బోర్డులు ఏర్పాటు దర్శనం ఇస్తుండటంతో స్టాక్ ఉన్న బంక్ ల వద్ద వాహనదారులు కిలోమీటర్ల మేర బారులుతీరుతున్నారు.

ఓ వైపు సోషల్ మీడియాలో వదంతులు, పలు చోట్ల నో స్టాక్ బోర్డులతో మరోసారి ఇంధన కొరత పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం పెట్రోల్ తో పోలిస్తే డీజిల్ కొరత ఎక్కువగా కనిపిస్తోంది. చాలా చోట్ల కేవలం పెట్రోల్ మాత్రమే అందుబాటులో ఉందని డీజిల్ స్టాక్ లేదని నిర్వాహకులు చెబుతున్నారు. దీంతో స్టాక్ ఉన్న చోటకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. వ్యవసాయ అవసరాలతో పాటు భారీ వాహనాలకు డీజిల్ ఉపయోగిస్తారు. రాబోయో రోజుల్లో పెట్రోల్, డీజిల్ దొరకదనే వదంతులతో వాహనదారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో డబ్బాలు, డ్రమ్ముల్లో బంక్ల నుంచి ఇంధనం తీసుకువెళ్తున్న వారి సంఖ్య పెరిగిపోయింది. ఏపీలో డీజిల్ కొరత కారణంగా అక్కడి ప్రజలు తెలంగాణ బార్డర్ జిల్లాల్లో వచ్చి ఇంధనం కొనుగోలు చేస్తుండటంతో ఆ ప్రాంతాల్లోనూ ఇంధన సమస్య మరింతగా కనిపిస్తోంది.

రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరతపై పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేంద్రం చెప్పినా ఆయిల్ కంపెనీలు క్రిడిట్ ఫెసిలిటీ ఇవ్వడం లేదన్నారు. ఇప్పుడు అడ్వాన్స్ పేమెంట్ చేసినా పెట్రోల్, డీజిల్ అందడం లేదని పోర్టల్లో ట్యాంకర్ కేటాయించినా బంక్కి మాత్రం రావడం లేదన్నారు. స్టాక్ పెట్టకూడదనే ఉద్దేశంతో సప్లై నిలిపేశారని చెప్పారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు గణనీయంగా పెరుగుతున్నప్పటికీ దేశీయంగా ఇంధన ధఱలు పెరగడం లేదు. దీంతో ప్రతి లీటర్ విక్రయంపై చమురు కంపెనీలు భారీగా నష్టాలు చవి చూస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ నష్టాలను తగ్గించుకునే క్రమంలో కొన్ని కంపెనీలు తమ రిటైల్ అవుట్లెట్లకు చేసే సరఫరాలో భారీగా కోత విధిస్తున్నాయని అందువల్లే ఈ సమస్య తలెత్తుతున్నట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande