
యాదాద్రి భువనగిరి, 27 ఏప్రిల్ (హి.స.)
ప్రజా సమస్యలు పరిష్కారం దిశగా నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్లక్ష్యానికి గురవుతుంది. గ్రీవెన్స్ సమావేశం పట్ల అధికారులకు చిత్తశుద్ధి లేనట్లు కనిపిస్తోంది. కొందరు అధికారులు గ్రీవెన్స్ సమావేశానికి రాకుండా కిందిస్థాయి ఉద్యోగులను పంపితే వచ్చిన జిల్లా అధికారులు మాట ముచ్చట్లతో కాలక్షేపం చేస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి దరఖాస్తుదారులు వచ్చి కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నారు. అయితే ప్రజావాణి కార్యక్రమంలో ఒక విచిత్రమైన సన్నివేశం కంటబడింది. జిల్లా మార్కెటింగ్ అధికారితో పాటు మరో ఇద్దరు అదే శాఖకు చెందిన కిందిస్థాయి ఉద్యోగులు రౌండ్ టేబుల్ సమావేశంలో కూర్చున్నట్లు కూర్చొని ముచ్చటిస్తున్నారు.
గ్రీవెన్స్ సమావేశంలో ప్రజల నుంచి రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ వెంక రెడ్డి, స్థానిక సంస్థల అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావులు ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటూ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడుతుండగా వీరు మాత్రం గ్రీవెన్స్ తో తమకేమీ సంబంధం లేదన్నట్లు వ్యవహరించారు. గ్రీవెన్స్ కు వచ్చిన ఫిర్యాదుదారులు వారిని చూసి ఇది గ్రీవెన్స్ సమావేశమా...? లేక ఏదైనా ప్రైవేట్ ఫంక్షనా...? అంటూ ముక్కున వేలేసుకున్నారు. సమస్యల పరిష్కారం చూపాల్సిన జిల్లా స్థాయి అధికారులే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రజల సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని జిల్లా ప్రజలు వాపోతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..