జగిత్యాల ప్రజావాణిలో ఉద్రిక్తత.. పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ ముందుకు వచ్చిన వ్యక్తి..
జగిత్యాల ప్రజావాణిలో ఉద్రిక్తత.. పురుగుల మందు డబ్బాతో కలెక్టర్ ముందుకు వచ్చిన వ్యక్తి..
ప్రజావాణి


జగిత్యాల, 27 ఏప్రిల్ (హి.స.)

జగిత్యాల జిల్లా ప్రజావాణి కార్యక్రమంలో ఉద్రిక్తత సంఘటన చోటుచేసుకుంది.కలెక్టర్ సారు నాకు న్యాయం చేయండి.. న్యాయం జరగకపోతే ఇక నాకు చావే శరణ్యం అంటూ మల్యాల మండలం నూకపెల్లి గ్రామానికి చెందిన మారంపెల్లి నారాయణ పురుగుల మందు డబ్బాతో ప్రజావాణి కి వచ్చాడు. తనకు చెందిన పట్టా భూమిని సర్పంచ్ చెవులమద్ది శ్రీనివాస్ సహా కొందరు అక్రమంగా ఆక్రమించారని ఆరోపిస్తూ కలెక్టర్ కు ఫిర్యాదు చేసాడు. తాను గ్రామంలో లేని సమయంలో తన భూమిలో హద్దురాళ్లు, ఫెన్సింగ్ను బ్లేడ్ ట్రాక్టర్తో తొలగించారని, అంతేకాకుండా గతంలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారని తెలిపాడు.

తనకు సర్వహక్కులు ఉన్న పట్టా భూమిలో కొంత భాగం గ్రామ పంచాయతీకి చెందినదని చెప్తూ కబ్జా చేసారని వాపోయాడు. ఈ విషయాన్ని ఇప్పటికే గ్రామ పంచాయతీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపాడు. సర్పంచ్ ప్రోత్సాహంతో కొందరు తనపై దౌర్జన్యానికి పాల్పడుతూ, భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని నారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. కలెక్టర్ కు తన సమస్య వివరిస్తూనే వెంట సీక్రెట్ గా తెచ్చుకున్న పురుగుల మందు డబ్బాను బయటకు తీయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పురుగుల మందు డబ్బాను స్వాధీనం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కాగా ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేస్తామని కలెక్టర్ బాధితుడికి హామీ ఇచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande