
అనంతపురం, 27 ఏప్రిల్ (హి.స.):అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో నిన్న అర్ధరాత్రి ఒక చిన్న వివాదం పెను విషాదానికి దారితీసింది. కేవలం బైక్ తాళం విషయంలో మొదలైన వాగ్వాదం, ఓ యువకుడి ప్రాణాలను తీసింది. స్నేహితుల మధ్య జరిగిన ఈ ఘర్షణ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి తాడిపత్రి పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాడిపత్రి పట్టణంలోని బంకమట్టి కాలనీకి చెందిన దూదేకుల అబ్దుల్లా, భాష, గౌస్, కార్తీక్లు ప్రాణ స్నేహితులు. రోజూ వీరంతా కలిసి సరదాగా గడిపేవారు. అయితే, ఆదివారం రాత్రి వీరి మధ్య ఓ చిన్న విషయంలో మనస్పర్థలు వచ్చాయి. అబ్దుల్లాకు చెందిన బైక్ తాళంచెవిని అతని స్నేహితులు కింద పడవేశారు. ఈ చిన్న విషయంపై అబ్దుల్లాకు, ఆయన స్నేహితులైన కార్తీక్, గౌస్, మరో ఇద్దరికి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం మొదలైంది. ఒకరినొకరు దూషించుకోవడంతో గొడవ ముదిరింది. మాట మాట పెరగడంతో ఆవేశానికి లోనైన గౌస్, కార్తీక్లు అమానుషంగా ప్రవర్తించారు. విచక్షణ కోల్పోయి పక్కనే ఉన్న పదునైన నాపరాళ్లను తీసుకుని అబ్దుల్లాపై దాడికి దిగారు. ఈ దాడిలో తల, ఇతర భాగాల్లో బలమైన గాయాలు కావడంతో అబ్దుల్లా తీవ్ర రక్తస్రావానికి గురయ్యాడు. గాయాల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అబ్దుల్లా అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.
పోలీసుల విచారణ..
ఈ ఘటనపై సమాచారం అందుకున్న తాడిపత్రి పట్టణ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన గౌస్, కార్తీక్లను పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, హత్యకు గల పూర్తి కారణాలు, ఆ సమయంలో అక్కడ ఉన్న ఇతర వ్యక్తుల పాత్రపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు. అబ్దుల్లా మరణంతో బంకమట్టి కాలనీలో విషాద ఛాయలు అలముకున్నాయి. బాధిత కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV