
దిల్లీ, 30 ఏప్రిల్ (హి.స.)
భారత్ స్వచ్ఛందంగా 'ఆపరేషన్ సిందూర్'ను నిలిపివేసిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తెలిపారు. పాకిస్థాన్పై సుదీర్ఘ యుద్ధానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అలాగే పాకిస్థాన్ను అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్రంగా అభివర్ణించారు. ఉగ్రవాదం సైద్ధాంతిక, రాజకీయ మూలాలను కూకటివేళ్లతో పెకిలించి వేయాలని పిలుపునిచ్చారు. అణ్వాయుధ దాడి అనే బెదిరింపునకు భారత్ లొంగిపోలేదని పరోక్షంగా దాయాది దేశం పాక్కు చురకలంటించారు. దిల్లీలో జరుగుతున్న ఏఎన్ఐ జాతీయ భద్రతా సదస్సు 2.0లో రాజ్నాథ్ పాల్గొన్నారు. ఈ క్రమంలో పాక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
అంతర్జాతీయ సంబంధాలలో శాంతి, స్థిరత్వానికి ఒక బలమైన నిరోధక శక్తి అత్యవసరమని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన సన్నాహాలు, స్వదేశీ ఆయుధాల విశ్వసనీయత భారత నిరోధక శక్తికి నిదర్శనాలని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ కేవలం 72 గంటల్లోనే పూర్తై ఉండొచ్చని, కానీ దాని కోసం జరిగిన సన్నాహాలు మాత్రం చాలా సుదీర్ఘమైనవని వెల్లడించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశ రక్షణ ఎగుమతులు రికార్డు స్థాయిలో 62.66 శాతం పెరిగాయని చెప్పారు. మతం ముసుగులో ఉగ్రవాదాన్ని సమర్థించడం చాలా ప్రమాదకరమని పాక్కు పరోక్షంగా కౌంటర్ వేశారు.
'టెర్రరిజం అత్యంత ప్రమాదకరం, హానికరం'
పహల్గాంలో అమాయక పౌరులపై జరిగిన దాడి గురించి నాకు సమాచారం అందిన రోజు ఇంకా నాకు గుర్తుంది. అప్పుడు వెంటనే నేను వ్యక్తిగతంగా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ముగ్గురు కార్యదర్శులు, రక్షణ కార్యదర్శితో సమావేశమయ్యాను. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి మన సాయుధ దళాలు సిద్ధంగా ఉండాలని నేను వారికి చెప్పాను. పాక్పై ఆపరేషన్కు తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని త్రివిధ దళాల అధిపతులు తెలియజేశారు. వారికి అభినందనలు. ఉగ్రవాదం ఉన్నంత కాలం అది మన సమిష్ఠి శాంతి, అభివృద్ధి, శ్రేయస్సుకు సవాల్గా నిలుస్తూనే ఉంటుంది. కొన్నిసార్లు ఉగ్రవాదాన్ని మతం ముసుగులో కప్పిపుచ్చడం, హింసాత్మక భావజాలంతో ముడిపెట్టి సమర్థించే ప్రయత్నాలు జరుగుతాయి. ఇది అత్యంత ప్రమాదకరం, హానికరం. ఇది ఉగ్రవాదులకు కవర్ ఫైర్ అందించి, వారి లక్ష్యాల వైపు నెమ్మదిగా ముందుకు సాగడానికి అనుమతించడంతో సమానం. ప్రపంచం ప్రస్తుతం నిరంతరం మార్పులకు లోనవుతోంది. కొన్ని చోట్ల సంఘర్షణ, మరికొన్ని చోట్ల అస్థిరత ఉంది. యూరప్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. పశ్చిమాసియాలో మనం ప్రతిరోజూ యుద్ధ భయానక దృశ్యాలను చూస్తున్నాం. అని రాజ్నాథ్ స్పష్టం చేశారు.
ఉగ్రవాదం కేవలం దేశ వ్యతిరేక చర్య మాత్రమే కాదని, అందులో బహుముఖ కోణాలు ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. టెర్రరిజాన్ని కార్యాచరణ, సైద్ధాంతిక, రాజకీయ కోణాలలోనూ ఎదుర్కొన్నప్పుడే దానిని అరికట్టగలమని పేర్కొన్నారు. ఉగ్రవాదం అసలైన ఐపీ అడ్రస్ దాని సైద్ధాంతిక, రాజకీయ మూలాలేనని చెప్పారు. టెర్రరిజానికి లభించే సైద్ధాంతిక పోషణ, రాజకీయ అండ అనేవి రావణుడి నాభిలోని అమృతం లాంటివని అభిప్రాయపడ్డారు. పాకిస్థాన్ వంటి దేశాలు నిరంతరం ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్నాయని మండిపడ్డారు. భారత్, పాక్ రెండూ ఒకే సమయంలో స్వాతంత్ర్యం పొందాయి. నేడు ఇండియా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే పాకిస్థాన్ మరో ఐటీకి అంటే అంతర్జాతీయ ఉగ్రవాదానికి కేంద్ర బిందువుగా మారింది. భారత్ను పాక్ అణుదాడితో కూడా బెదిరించింది. కానీ ఆ బెదిరింపులకు భారత్ ఎప్పుడూ లొంగలేదు. అని రాజ్నాథ్ పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi