
న్యూఢిల్లీ, 05 ఏప్రిల్ (హి.స.)త్వరలో జరుగనున్న అస్సాం (Assam), పశ్చిమబెంగాల్ (West Bengal) అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి (Nitin Gadkari) అన్నారు. సమ్మిళిత అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని, మతపరమైన ఏ గ్రూపులకు వ్యతిరేకం కాదని చెప్పారు.
మైనారిటీలు, ఎస్ఐఆర్పై కేంద్రంలోని బీజీపీ వైఖరిపై ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, సమ్మళిత అభివృద్ధే బీజేపీ విధానమని అన్నారు. ప్రగతి, ఐక్యతకు కట్టుబడి పార్టీ పనిచేస్తోందని, మతపరమైన ఏ గ్రూపులకు వ్యతిరేకం కాదని చెప్పారు. ఎస్ఐఆర్ వంటి అంశాల విషయంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుంటుందని తెలిపారు. 'అస్సాం, బెంగాల్లో మేము గెలుస్తామనే గట్టి నమ్మకం నాకుంది. ఏదో ఒక మతాన్ని కాకుండా అందర్నీ కలుపుకుని వెళ్లడమే బీజేపీ విధానం. చొరబాటుదారులను మేము వ్యతిరేకిస్తామే కానీ ముస్లింలకు వ్యతిరేకం కాదు' అని గడ్కరి వివరణ ఇచ్చారు.
పార్టీ ఎన్నికల ప్రచారంలో అభివృద్ధి అనేదే ప్రధాన అంశమని, ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధికి కట్టుబడి పార్టీ పనిచేస్తోందని గడ్కరి చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో ప్రధానంగా పెట్టుబడులు పెడుతున్నామని, మరిన్ని ప్రాజెక్టులకు కూడా ప్లానింగ్ చేస్తున్నామని తెలిపారు. .
అక్రమ చొరబాట్లకు తమ పార్టీ వ్యతిరేకమని, ఏ నిర్దిష్ట మతానికి కాదని గడ్కరి స్పష్టం చేశారు. అక్రమ చొరబాట్లను అడ్డుకోకుంటే దేశం ఒక ధర్మశాలగా మారుతుందని గడ్కరి హెచ్చరించారు. పశ్చిమబెంగాల్లో రాజకీయ మార్పు కోరుతూ ప్రజల నుంచి మద్దతు పెరుగుతోందని చెప్పారు. ఓటర్ల జాబితా ఎస్ఐఆర్ ప్రక్రియపై బెంగాల్ ముఖమంత్రి మమతా బెనర్జీ చేస్తున్న ఆరోపణలపై స్పందిస్తూ, జాతీయ ప్రయోజనాలే బీజేపీకి ముఖ్యమని అన్నారు. జాతీయ ప్రయోజనాల విషయంలో తాము రాజకీయాలు చేయమని, ఆయా అంశాలను (ఎస్ఐఆర్ వంటి అంశాలు) కేవలం జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే చేపడుతున్నామని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్