ఎయిడ్స్ పై అవగాహనతోనే నివారణ సాధ్యం.. వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
ఎయిడ్స్ పై అవగాహనతోనే నివారణ సాధ్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు
Collector


వరంగల్, 09 ఏప్రిల్ (హి.స.)

ఎయిడ్స్ పై అవగాహనతోనే నివారణ సాధ్యమని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరోగ్య వారోత్సవాల కింద నాలుగో రోజు ఎయిడ్స్పై అవగాహన, నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కాకతీయ మెడికల్ కళాశాల నుండి ఎంజీఎం ఆసుపత్రి కూడలి వరకు నిర్వహించిన రెడ్ రన్ వాకథాన్ ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీలో జిల్లా అధికారులు, వైద్య అధికారులు, ఆశాలు, సిబ్బంది, వైద్య విద్యార్థులు, నర్సింగ్ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని, చేతిలో ప్లకార్డులు చేతబూని ఎయిడ్స్ నివారణ నినాదాలతో ప్రజలకు సందేశం అందించారు.

ర్యాలీ అనంతరం ఎంజీఎం కూడలి వద్ద నిర్వహించిన మానవహారంలో పాల్గొన్నారు. ఎయిడ్స్ పై సమాజంలో సరైన అవగాహన కల్పించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఎయిడ్స్ పై సరైన జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని తెలిపారు. అసురక్షిత లైంగిక సంబంధాలు, సంక్రమిత రక్త మార్పిడి, కలుషిత సూదులు, సిరంజీల వినియోగం ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఒక్కరూ సురక్షిత పద్ధతులను అనుసరించడం, అవసరమైనప్పుడు హెచ్ ఐవి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తించి చికిత్స పొందవచ్చని తెలిపారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా పరీక్షలు, చికిత్స, కౌన్సిలింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, బాధితులు భయపడకుండా వాటిని వినియోగించుకోవాలని సూచించారు. వరంగల్ జిల్లాలో నర్సంపేట, వర్ధన్నపేట, ఎంజీఎం, సీకేఎం ప్రభుత్వ

దవాఖానల్లో ఉచితంగా ఎయిడ్స్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎయిడ్స్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి కూడా ఎయిడ్స్ పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తూ, తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సంక్రమించకుండా నివారణ చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.

ఎయిడ్స్ వ్యాధి నిర్ధారణ అయిన వెంటనే ఏఆర్టీ కేంద్రాల ద్వారా వారికి ఉచిత చికిత్సలు అందిస్తున్నారని తెలిపారు. హెచ్ ఐవి బాధితుల పట్ల వివక్ష చూపకుండా మానవతా దృక్పథంతో సహకరించడం సమాజ బాధ్యత అని పేర్కొన్నారు. ముఖ్యంగా యువతలో అవగాహన పెంపొందించేందుకు పాఠశాలలు, కళాశాలలు, గ్రామ మరియు పట్టణ స్థాయిలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందని, ఇటువంటి ర్యాలీలు సమాజంలో చైతన్యం తీసుకు వస్తాయని కలెక్టర్ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande