ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్.. భాగ్యనగరంలో కీలక మార్పులు
భాగ్యనగరంలోని కీలకమైన షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు 'మోడల్ కారిడార్'
Traffic hyderabad


హైదరాబాద్, 09 ఏప్రిల్ (హి.స.)భాగ్యనగరంలోని కీలకమైన షేక్పేట్ ఫ్లైఓవర్ నుంచి మాసాబ్ ట్యాంక్ వరకు ట్రాఫిక్ కష్టాలను తీర్చి, ఈ మార్గాన్ని 'మోడల్ కారిడార్'గా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గురువారం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, ఐపీఎస్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, ఐఏఎస్, ఇతర ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అధికారులందరూ కలిసి ఒకే బస్సులో ప్రయాణిస్తూ.. మార్గమధ్యలో ఉన్న బాటిల్ నెక్లు (ట్రాఫిక్ అడ్డంకులు), నీరు నిలిచే ప్రాంతాలు, ఆక్రమణలను స్వయంగా పరిశీలించి తక్షణ పరిష్కార మార్గాలను సూచించారు.

ఎస్డిఐ హాస్పిటల్ వద్ద, బృందావన్ కాలనీ రోడ్ నంబర్-1 వద్ద కొత్తగా ఫుట్ ఓవర్ బ్రిడ్జిల (FOB)ను నిర్మించాలని నిర్ణయించారు. షేక్పేట్ నాలా వద్ద పెలికాన్ సిగ్నల్, జీబ్రా క్రాసింగ్లను ఏర్పాటు చేయనున్నారు.

నానల్ నగర్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు వీలుగా అక్కడ ఉన్న రోటరీ (Rotary) వెడల్పును తగ్గించి, రహదారిని విస్తరించాలని అధికారులను ఆదేశించారు.

రహదారి మధ్యలో ఉన్న రామాలయం ఆర్చ్, బొడ్రాయి, అలాగే షేక్పేట్ నాలా సమీపంలోని సమాధులను తొలగించి వాహనాల రాకపోకలకు మార్గం సుగమం చేయాలని కమిషనర్లు ఆదేశించారు. మాసాబ్ ట్యాంక్ ఫ్లైఓవర్ వద్ద ఎత్తు పరిమితి బారియర్లు, హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయనున్నారు. మెహదీపట్నం వైపు ఉన్న ఎలక్ట్రికల్ ట్రాన్స్ఫార్మర్ను తరలించి, పోచమ్మ బస్తీ నుంచి రోడ్ నంబర్ 12కు నేరుగా వెళ్లేలా స్లిప్ రోడ్డును అభివృద్ధి చేయనున్నారు.

ట్రాఫిక్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేలా తక్షణమే చేయదగ్గ పనులు, దీర్ఘకాలిక పనులను గుర్తించామని హైదరాబాద్ సీపీ సజ్జనార్, ఐపీఎస్ పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande