నేను నా కూతురిని కోల్పోయా.. మమతా బెనర్జీ 'కుర్చీ'ని కోల్పోయారు: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
నేను నా కూతురిని కోల్పోయా.. మమతా బెనర్జీ 'కుర్చీ'ని కోల్పోయారు: ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
kalakatta


కోల్కతా, 26 మే (హి.స.)

పశ్చిమ బెంగాల్ను కుదిపేసిన ఆర్జీ కర్ అత్యాచారం, హత్య కేసులో బాధితురాలి తల్లి, బీజేపీ ఎమ్మెల్యే రత్న దేబ్నాథ్ నిన్న సీఎం సువేందు అధికారిని కలిశారు. సచివాలయంలో జరిగిన ఈ సమావేశం అనంతరం ఆమె మాజీ సీఎం మమతా బెనర్జీ రాజకీయ ఓటమిని ప్రస్తావిస్తూ సోషల్ మీడియాలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.

2024 ఆగస్టు 8-9 తేదీల మధ్య రాత్రి, కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో విధి నిర్వహణలో ఉన్న 31 ఏళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్ డాక్టర్పై అత్యాచారం చేసి, దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రత్న దేబ్నాథ్ కుమార్తె తల్లిగా న్యాయపోరాటం చేస్తూ, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పానిహటి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

సీఎంతో భేటీ తర్వాత 'ఎక్స్'లో రత్న దేబ్నాథ్ ఒక పోస్ట్ చేశారు. ఈరోజు నేను నబన్నా (సచివాలయం) 14వ అంతస్తులో ముఖ్యమంత్రితో సమావేశంలో ఉన్నాను. ఆయన పేరు సువేందు అధికారి. నిజాయతీకి ఉన్న శక్తి అపారం. అన్యాయంపై ఓపికగా పోరాడితే చాలు అని పేర్కొన్నారు. ఈరోజు నేనూ, మమత ఇద్దరం నష్టపోయాం. నేను నా ఏకైక కుమార్తెను కోల్పోయి ప్రజాసేవకు అంకితమయ్యాను. మమత 14వ అంతస్తులోని తన సీఎం కుర్చీని కోల్పోయారు అని అన్నారు. మమత, ఆమె బృందం మరింత దారుణమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, వేచి చూడండి అంటూ హెచ్చరించారు.

సమావేశం అనంతరం రత్న దేబ్నాథ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యే అయినా తన జీవితంలో సంతోషం లేదని, కుమార్తెకు న్యాయం జరగడమే తన ఏకైక లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి తాను అనుమానిస్తున్న కొందరి పేర్లను ముఖ్యమంత్రికి అందజేశానని, గతంలో దర్యాప్తు అధికారులకు కూడా అవే పేర్లు ఇచ్చానని తెలిపారు.

ఇదిలా ఉంటే.. పశ్చిమ బెంగాల్లో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఈ కేసు విచారణను వేగవంతం చేసింది. ఆర్జీ కర్ ఘటన సమయంలో కీలక పదవుల్లో ఉన్న ఐపీఎస్ అధికారులు వినీత్ గోయల్, ఇందిరా ముఖర్జీ, అభిషేక్ గుప్తాలపై శాఖాపరమైన విచారణకు సీఎం సువేందు అధికారి ఆదేశించారు. విచారణ పూర్తయ్యే వరకు వారిని సస్పెండ్ చేశారు. కాగా, ఈ కేసు దర్యాప్తు కోసం సీబీఐతో ముగ్గురు సభ్యుల ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని కలకత్తా హైకోర్టు గతంలోనే ఆదేశించిన సంగతి తెలిసిందే.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande