
మేడ్చల్ మల్కాజిగిరి, 04 మే (హి.స.)
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న జవహర్ నగర్ డంపింగ్ యార్డు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం జవహర్ నగర్ డంపింగ్ జేఏసీ సభ్యులు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తోటకూర వజ్రష్ యాదవ్ నేతృత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో కలిసి సమస్య ను వివరించారు. వారి సమస్యలు విన్న అనంతరం సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ నెల 15 వరకు పూర్తి స్థాయి నివేదిక కావాలని ఆదేశించారు. మే 15 తర్వాత అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి జవహర్ నగర్ డంపింగ్ యార్డ్ సమస్యకు ఏలాంటి పరిష్కారం చూపాలి త్వరలోనే నూతనంగా ఏర్పాటు చేయబోయే డంపింగ్ యార్డులపై అఖిలపక్ష సమావేశంలో అభిప్రాయాలు తీసుకోవాలని ఆదేశించారు. అదే విధంగా మారిన పరిస్థితులను బట్టి విదేశాలలో చెత్త సేకరణ కోసం అవలంబిస్తున్న శాస్త్రీయ పద్ధతులను అధ్యయనం చేసేందుకు గాను అవసరమైతే అఖిలపక్ష పార్టీల కమిటీలతో పాటు అధికారుల బృందాన్ని విదేశాలకు పంపుతామని తెలిపారు. ఎండ్ల తరబడి అపరిష్కృతంగా ఘటకేసర్ రైల్వే వంతెన నిర్మాణం లో జరుగుతున్న జాప్యంపై వజ్రష్ యాదవ్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళగా అధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి వంతెన వెంటనే పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు