
వికారాబాద్, 04 మే (హి.స.)
కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ
రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం వారు వికారాబాద్ జిల్లా తుమ్మల తాండూరులో ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా మే 4 నుంచి మే 9 వరకు రైతు వారోత్సవాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 'టీజీ ఆర్గానిక్స్' అనే ప్రత్యేక మొబైల్ యాప్ను ఆవిష్కరించారు. సేంద్రియ ఉత్పత్తుల ప్రదర్శన కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. ముందెన్నడూ లేని విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధునిక విప్లవాత్మక విధానాలు తీసుకువస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సేంద్రీయ (Organic) వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి, రైతులు-వినియోగదారుల మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని నెలకొల్పడానికి టీజి ఆర్గానిక్స్ (TG Organics) మొబైల్ యాప్ ను ప్రవేశపెట్టినట్టు తెలిపారు.
ఈ యాప్ తెలంగాణ స్టేట్ సీడ్ అండ్ ఆర్గానిక్ సర్టిఫికేషన్ అథారిటీ ద్వారా (TSSOCA) ధృవీకరించబడిన (Certified) రైతుల నుండి మాత్రమే ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. దీనివల్ల కల్తీ లేని అసలైన ఆర్గానిక్ ఆహారం దొరుకుతుందని పేర్కొన్నారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా రైతుల నుండి తాజా కూరగాయలు, పండ్లు, ధాన్యాలను కొనుగోలు చేయవచ్చన్నారు. వినియోగదారులు తమకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ఆర్గానిక్ రైతులను వెతుక్కుని, వారి ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చని తెలిపారు. యాప్ ద్వారానే రైతులకు ఫోన్ చేసి, ఉత్పత్తుల వివరాలు తెలుసుకుని ఆర్డర్ చేయవచ్చన్నారు. ముఖ్యంగా మధ్యవర్తుల ప్రమేయం లేకపోవడం వల్ల, రైతులు తమ పంటకు సరైన ధరను పొందవచ్చని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు తమ ఉత్పత్తులను పరిచయం చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.
ఈ యాప్ను ప్లే స్టోర్ (Play Store) నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. తాండూరులో కందిబోర్డును ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం యూరియా విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. అధికారం కోల్పోయిన వారు ఒకవైపు, అధికారంలోకి రావాలనుకున్నవారు మరోవైపు కాంగ్రెస్ ను బదులాం చేస్తున్నారని విమర్శించారు. తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ వ్యవసాయం దండుగ కాదు పండుగ అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు