
కోల్కతా, 26 జూన్ (హి.స.)
కోల్కతాలోని తారాతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న గోదాము కూలిన ప్రమాదంలో మరణాల సంఖ్య 15కు చేరింది. జూన్ 24, బుధవారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరగ్గా శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు మూడో రోజు కూడా నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. గురువారం రాత్రి శిథిలాల నుండి మరో రెండు మృతదేహాలను వెలికితీశారు. అలాగే తీవ్రంగా గాయపడి ప్రభుత్వ SSKM ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మన్ను కుమార్, సాహిల్ సర్దార్ అనే ఇద్దరు కార్మికులు శుక్రవారం ఉదయం మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 15కు పెరిగింది. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), ఇండియన్ ఆర్మీ, కోల్కతా పోలీస్, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ బృందాలు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. భారీ ఐరన్ బీమ్లు, కాంక్రీట్ స్లాబ్లను తొలగించడానికి భారతీయ రైల్వే కూడా రంగంలోకి దిగి ఆక్సిజన్ కటింగ్ మెషీన్లతో సహాయం అందిస్తోంది. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా అని చూడటానికి ప్రత్యేక సెర్చ్ కెమెరాలను లోపలికి పంపుతున్నారు. యాక్టివ్గా ఉన్న మొబైల్ ఫోన్ టవర్ డేటా ఆధారంగా వారి లోకేషన్లను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉదంతంపై కోల్కతా పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నిర్మాణంలో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనపై కేసు నమోదు చేసి, బిల్డింగ్ స్ట్రక్చరల్ ఇంజనీర్తో పాటు ఇప్పటివరకు ఆరుగురిని అరెస్ట్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi