
కృష్ణా జిల్లా,, 04 జూలై (హి.స.)
కృష్ణా జిల్లాలోని గూడూరు మండలం అనంతయ్యపేట గ్రామంలో ఈరోజు (శనివారం) విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే ఇంట్లో ముగ్గురు మహిళలు హనుమకొండ రజిని కుమారి, మధుబాల, గౌరీదేవి ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు మహిళల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఈ ఘటన వెనుక కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, వ్యక్తిగత సమస్యలు లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలపై గూడూరు పోలీసులు సమగ్ర విచారణ చేపట్టారు. మృతుల కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థుల నుంచి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ