23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం!
23 మందిని ఉగ్రవాదులుగా ప్రకటించిన కేంద్రం!
terrorist


హైదరాబాద్, 04 జూలై (హి.స.)

పాకిస్థాన్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న 23 మందిని చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద ఉగ్రవాదులుగా కేంద్రం ప్రకటించింది. వీరిలో జైష్-ఎ-మహ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ)తో పాటు వాటి అనుబంధ సంస్థలకు చెందిన కీలక నేతలు ఉన్నారు.

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌ ప్రకారం ఉగ్రదాడులు, ఉగ్రవాదుల నియామకం, నిధుల సమీకరణ, ఆయుధాల అక్రమ రవాణా, సరిహద్దు చొరబాట్లు, ఉగ్ర సంస్థలకు సహకారం వంటి కార్యకలాపాల్లో వీరు పాల్గొంటున్నట్లు పేర్కొంది.

ఈ 23 మందిలో 17 మంది పాకిస్థాన్‌ పౌరులు, ఆరుగురు భారతీయులు ఉన్నారు. ప్రస్తుతం వీరంతా పాకిస్థాన్‌, పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీవోకే) నుంచి ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కేంద్రం తెలిపింది.

ఈ జాబితాలో జైష్‌కు చెందిన మసూద్ ఇల్యాస్ కశ్మీరీ, మొహమ్మద్ ముసద్దిక్, ముఫ్తీ మహ్మద్ అస్గర్ ఖాన్, అబ్దుల్లా జెహాదీ వంటి కీలక నేతలు ఉన్నారు. వీరు ఉగ్రవాదుల శిక్షణ, నియామకం, భారత్‌లోకి చొరబాట్లు, దాడుల ప్రణాళికలో కీలక పాత్ర పోషించినట్లు కేంద్రం ఆరోపించింది. 2022 సుంజ్వాన్‌ దాడి, 2016 నాగ్రోటా ఆర్మీ క్యాంప్‌పై దాడులతోనూ వీరికి సంబంధాలు ఉన్నట్లు పేర్కొంది.

లష్కరే తోయిబాకు చెందిన ఫిర్దౌస్ అహ్మద్ భట్, హరూన్ రషీద్ గనాయ్తో పాటు మరికొందరినీ ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. వీరు ఆయుధాల సరఫరా, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించడం, దాడులకు అవసరమైన లాజిస్టిక్‌ సహాయం అందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

2019లో యూఏపీఏ సవరణల తర్వాత ఉగ్ర సంస్థలతో పాటు వ్యక్తులను కూడా నేరుగా ఉగ్రవాదులుగా ప్రకటించే అధికారం కేంద్రానికి లభించింది. అదే అధికారాన్ని వినియోగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi


 rajesh pande