
సూర్యాపేట, 21 ఆగస్టు (హి.స.)
నేరాల నియంత్రణ, ప్రజలకు మెరుగైన పోలీసు సేవలే లక్ష్యంగా పనిచేయాలని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కోదాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని ఆయన వార్షికంగా తనిఖీ చేశారు. కోదాడ డీఎస్పీ శ్రీనివాల్రెడ్డితో కలిసి కార్యాలయాన్ని పరిశీలించిన ఎస్పీ.. సిబ్బంది గౌరవ వందనం స్వీకరించి ప్రాంగణంలో మొక్కలు నాటారు. కోదాడ రూరల్, అనంతగిరి, చిలుకూరు, చింతలపాలెం, మేళ్లచెరువు పోలీస్టేషన్ల కేసుల నమోదు, దర్యాప్తు, పెండింగ్ కేసులు, గ్రామాల చరిత్ర రికార్డులు, సస్పెక్ట్, రౌడీ షీట్లను పరిశీలించారు. కేసులు, ఫిర్యాదులను పెండింగ్లో ఉంచకుండా వేగంగా పరిష్కరించాలని సూచించారు. సరిహద్దు నేపథ్యంలో చెకోపోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేయాలని, ప్రధాన రహదారుల్లో ప్రతిరోజూ వాహన తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ ఆదేశించారు.
అక్రమ రవాణాను అడ్డుకునేందుకు సమాచార వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని సూచించారు.విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య గొడవలు, మాదకద్రవ్యాల వినియోగం వంటి సమస్యలు తలెత్తకుండా 'పోలీసు ప్రజా భరోసా' కార్యక్రమాల ద్వారా నిరంతరం అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.సీసీ కెమెరాలతో నిఘా: దొంగతనాలు, ఇతర నేరాల నియంత్రణకు పెద్దఎత్తున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, వాటిని జిల్లా కేంద్రానికి అనుసంధానం చేశామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్ఫోర్స్మెంట్ చర్యలను మరింత పటిష్టం చేయాలని ఆదేశించారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల పనితీరు, సిబ్బంది సేవలను ఎస్పీ అభినందించారు. అనుమానితుల కదలికలపై నిరంతర నిఘ ఉండాలన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు