
పులివెందుల, 21 ఆగస్టు (హి.స.) వైసీపీ కీలక నేత, కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash Reddy) ఇళ్లు, నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు మెరుపు దాడులకు దిగారు.
ఇవాళ తెల్లవారుజాము నుంచే హైదరాబాద్ (Hyderabad), పులివెందులలోని ఆయన నివాసాల్లో ఈడీ బృందాలు ఏకకాలంలో సోదాలు ప్రారంభించాయి. ఎంపీ అవినాశ్ రెడ్డితో పాటు ఆయన ముఖ్య అనుచరులైన శంకర్ రెడ్డి, సునీల్ రెడ్డిల ఇళ్లలోనూ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 విభిన్న ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నట్లుగా సమాచారం.
రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం
ఒక్కసారిగా ఈడీ అధికారులు రంగంలోకి దిగి తనిఖీలు చేపడతుండటంతో తెలుగు రాష్ట్రాల (Telugu States) రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగింది. సోదాల సందర్భంగా ఇళ్ల వద్ద ముందస్తుగా కేంద్ర బలగాలను భారీగా మోహరించారు. నివాసాలలో ఉన్న కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన రికార్డులను ఈడీ బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ తనిఖీలకు సంబంధించి కారణాలు, ఇతర పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV