
హైదరాబాద్, 21 ఆగస్టు (హి.స.)
తెలంగాణలోని రైతాంగం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న 'రైతు భరోసా' (Rythu Bharosa) పథకం నిధుల పంపిణీ మరియు కొత్త మార్గదర్శకాలపై ఇవాళ ఉదయం కేబినెట్ సబ్ కమిటీ ముఖ్యమంత్రితో భేటీ అయింది. గత కొన్ని వారాలుగా రాష్ట్రవ్యాప్తంగా రైతులు, వ్యవసాయ నిపుణుల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించిన తుది నివేదికను కమిటీ ప్రభుత్వానికి సమర్పించింది. ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి అర్హులైన రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ. 7,500 చొప్పున జమ చేయడానికి ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది.
కొత్త మార్గదర్శకాల ప్రకారం, కేవలం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సహాయం అందనుంది. గుట్టలు, రోడ్లు, రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారిన భూములకు ఈసారి నిధుల విడుదలను పూర్తిగా నిలిపివేయనున్నారు. అలాగే గరిష్టంగా ఐదు ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ నిధులను నేరుగా డీబీటీ (DBT) పద్ధతిలో బ్యాంక్ ఖాతాల్లో వేయనున్నారు. వ్యవసాయ శాఖ ఇవాళ మధ్యాహ్నం నుండే క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల జాబితాల పరిశీలనను ముమ్మరం చేసింది. రాబోయే వారం రోజుల్లోనే అర్హులైన ప్రతి రైతు ఖాతాలో నగదు జమ ప్రక్రియ ప్రారంభమవుతుందని వ్యవసాయ శాఖ మంత్రి ప్రకటించారు
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi