
హైదరాబాద్, 03 ఆగస్టు (హి.స.)
దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్ మంతర్ వద్ద నిరసనలు, ధర్నాలు నిర్వహించడంపై సుప్రీంకోర్టులో ఈరోజు ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. జంతర్ మంతర్ ఇకపై నిరసనలు తెలపడానికి అనువైన వేదిక కాదని, దీనివల్ల స్థానిక నివాసితులకు మరియు ప్రజా రవాణాకు తీవ్ర ఆటంకం కలుగుతోందని దాఖలైన పిల్ (PIL - ప్రజా ప్రయోజన వ్యాజ్యం) ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది,.
ఈ పిటిషన్‌లో ప్రధానంగా నిరంతర ధర్నాల కారణంగా స్థానికులకు అత్యవసర వస్తువుల సరఫరా నిలిచిపోతోందని, నిత్యం ట్రాఫిక్ జామ్‌లు అవుతుండటం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతోందని పేర్కొన్నారు. నిరసనకారుల కోసం ప్రత్యామ్నాయంగా నగరం వెలుపల లేదా విస్తృతమైన స్థలం ఉన్న మరేదైనా ప్రాంతాన్ని కేటాయించాలని పిటిషనర్ కోరారు.
భారతదేశంలో శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు పౌరులకు ఉన్నప్పటికీ, అది ఇతరుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగించకూడదనే కోణంలో కోర్టు ఈ అంశాన్ని పరిశీలించనుంది. ఈ విచారణ ఫలితాన్ని బట్టి భవిష్యత్తులో ఢిల్లీలో పెద్ద ఎత్తున జరిగే రాజకీయ, సామాజిక ధర్నాల వేదికలు మారే అవకాశం ఉంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi