
హైదరాబాద్, 06 ఆగస్టు (హి.స.)
ఫార్ములా ఈ-రేసింగ్ కేసులో మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నాంపల్లి ప్రత్యేక కోర్టులో ఏసీబీ 75 పేజీల ఛార్జిషీట్ దాఖలు చేసింది. నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ ఖజానాపై రూ.600 కోట్ల భారం మోపేలా నేరపూరిత కుట్ర పన్నారని ఆరోపించింది. ఈ కేసులో కేటీఆర్తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్కుమార్, బీఎల్ఎన్ రెడ్డి, స్పోర్ట్స్ కన్సల్టెంట్ కిరణ్ మల్లేశ్వరరావు, ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్లను నిందితులుగా చేర్చింది. కేబినెట్, ఆర్థిక, న్యాయ శాఖల అనుమతులు లేకుండా నిర్ణయాలు తీసుకున్నారని ఏసీబీ పేర్కొంది. ప్రమోటర్ సంస్థ అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్కు రూ.44 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు అందాయని, దానికి ప్రతిఫలంగా రేసింగ్ బాధ్యతలు అప్పగించారనే క్విడ్ ప్రోకో కోణాన్ని ఏసీబీ ప్రస్తావించింది. హెచ్ఎండీఏ నిధుల నుంచి రూ.46.82 కోట్లు చెల్లించారని, కేటీఆర్పై ఐపీసీ 409, 120బీతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు వెల్లడించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..