వారంలో బో ‘ధనం
తొలిసారిగా... చదువుతున్న సంవత్సరంలోనే ఫీజుల చెల్లింపు మొదటివిడత ఉపకార వేతనాలు ఈ నెల 15లోగా వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమ.
Children welfare


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) రాష్ట్రంలో సంక్షేమ విద్యార్థులకు బోధన ఫీజులు, ఉపకార వేతనాల చెల్లింపుల్లో కీలక సంస్కరణ అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది. బోధన ఫీజుల చరిత్రలో తొలిసారిగా.. ఇంటర్, ఆపై చదువుతున్న విద్యార్థులకు ఆ విద్యా సంవత్సరంలోనే ఫీజులు అందనున్నాయి. 2026-27 నుంచి విద్యార్థుల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో ఉపకార వేతనాలు, బోధన ఫీజులు జమ చేయనుంది. బోధన ఫీజుల సంస్కరణల్లో భాగంగా ఏటా ఎప్పటికప్పుడు చెల్లించేందుకు షెడ్యూలును ప్రకటించింది. ఈ మేరకు ఈ ఏడాది జులై 31 నాటికి దరఖాస్తు చేసిన ఫ్రెషర్, రెన్యువల్ విద్యార్థులకు ఈ నెల 15 నాటికి ఫీజులు చెల్లించేందుకు సంక్షేమ శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి. తొలివిడత కింద దాదాపు లక్ష మందికిపైగా విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో బోధన ఫీజులు జమ చేసేందుకు వీలుగా నోడల్ విభాగమైన ఎస్సీ సంక్షేమశాఖ సమన్వయం చేస్తోంది. బ్యాంకు ఖాతాలో బోధన ఫీజులు జమ అయిన వారం రోజుల్లో విద్యార్థులు కళాశాలలకు చెల్లించాలి. లేకుంటే ఆ విద్యార్థుల నుంచి రెవెన్యూ రికవరీ చట్టం కింద ఫీజును వెనక్కు తీసుకోనుంది.

అడ్వాన్సుగా రూ.250 కోట్లు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థులకు బోధన రుసుములు చెల్లించేందుకు ప్రతినెలా రూ.250 కోట్లు ఇస్తామని ఇప్పటికే సంక్షేమశాఖలకు ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఆ మొత్తాన్ని అడ్వాన్సుగా విడుదల చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి ప్రస్తుతం ప్రవేశాలు ఇంకా కొనసాగుతున్నాయి. దీంతో రెన్యువల్ విద్యార్థులు లక్ష మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. జిల్లా సంక్షేమాధికారులు ఆ మేరకు బిల్లులు సిద్ధం చేశారు. సంక్షేమశాఖలకు సంబంధించి బీసీలో రూ.70 కోట్లు, ఈబీసీలో రూ.10 కోట్లు, ఎస్సీలో రూ.30 కోట్లు, ఎస్టీలో రూ.20 కోట్లు, మైనార్టీలో రూ.కోటి వరకు బిల్లులున్నాయి. ఎస్సీ విద్యార్థులకు రాష్ట్రం 40% విడుదల చేస్తే.. కేంద్రం 60% ఇస్తోంది. అలాగే ఎస్టీ విద్యార్థులకు రాష్ట్రం 25%, కేంద్రం 75% నిధులు సమకూర్చుతోంది. తొలివిడత కింద పరిష్కరించిన దరఖాస్తులకు కేంద్ర నిధులు మంజూరయ్యాయి.

డిసెంబరు నాటికి ‘రెన్యువల్’ పరిష్కారం..

2026-27 విద్యాసంవత్సరానికి ఫ్రెషర్ విద్యార్థుల దరఖాస్తులు మరో నెల రోజుల తర్వాత ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ప్రవేశాలు జరుగుతున్నాయి. వివరాలు పూర్తిస్థాయిలో అందేందుకు సెప్టెంబరు లేదా అక్టోబరు అయ్యే అవకాశాలున్నాయి. ఆలోగా రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులపై దృష్టిపెట్టింది. రెండో విడతలో(ఆగస్టు 1 నుంచి నవంబరు 30 నాటికి) రెన్యువల్ విద్యార్థుల దరఖాస్తులు కళాశాలల నుంచి పూర్తిస్థాయిలో తెప్పించి, పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. డిసెంబరు 30 నాటికి ఈ చెల్లింపుల కోసం మరో రూ.750 కోట్లు అవసరమని అంచనా వేస్తోంది. మూడో విడతలో డిసెంబరు 1 నుంచి జనవరి 31 వరకు స్వీకరించిన దరఖాస్తులకు అవసరమైన నిధులను ఫిబ్రవరి 28న చెల్లిస్తుంది. నాలుగో విడతలో.. ఫిబ్రవరి 1 నుంచి మార్చి 31 వరకు స్వీకరించిన దరఖాస్తులకు 75 రోజుల్లోగా నిధులు జమ చేస్తుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande