
హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ) సమావేశం ఎజెండాను ఒప్పుకొన్నారా? ఈ సమావేశానికి హాజరవుతారా? వెళ్తే తెలంగాణ ప్రజల తరఫున ఏం మాట్లాడుతారో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి చెప్పాలి’’ అని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ స్థాయిలో జల ఉద్యమం వస్తుందని, రాష్ట్ర నీటి హక్కులకు మించిన మరో ప్రాధాన్యం భారాసకు లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘‘నదీ జలాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టం కలిగించేలా వ్యవహరిస్తే తిరుగుబాటు తప్పదు. కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రానికి నీటి వాటాలో అన్యాయం చేస్తే తెలంగాణలో మరో ఆందోళన వస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చెప్పుచేతల్లో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. నీటిపారుదల శాఖ సలహాదారుగా ఉన్న ఆదిత్యనాథ్ దాస్ను వెంటనే తొలగించాలి. మేం లక్షల మంది రైతులతో కలిసి పంపులను ఆన్ చేస్తామంటే మహబూబ్నగర్ జిల్లాలో శనివారం పంపులను ప్రారంభించారు. పాలమూరు బిడ్డ అని చెప్పుకొనే రేవంత్రెడ్డికి.. ఆ ప్రాంతానికి నీళ్లిచ్చే సోయి లేదు. నదుల నుంచి పక్క రాష్ట్రం నీళ్లు ఎత్తుతుంటే సీఎం పట్టించుకోవడం లేదు.
హిల్ట్ పాలసీ రద్దు చేస్తాం: నగరంలోని పారిశ్రామిక ప్రాంతాల్లోని భూములను బహుళ వినియోగ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్(హిల్ట్) పాలసీపై సెప్టెంబరులో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. 10వేల ఎకరాల పారిశ్రామిక భూముల విషయంలో రేవంత్రెడ్డి చేస్తున్న రూ.5లక్షల కోట్ల కుంభకోణంపై రాష్ట్ర ప్రజలను జాగృతం చేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వేల కోట్ల సొమ్మును దండుకునేందుకు హిల్ట్ పాలసీని తెచ్చింది. భారాస అధికారంలోకి రాగానే ఈ పాలసీని రద్దు చేస్తాం. హిల్ట్కు సంబంధించి పారిశ్రామికవాడల అసోసియేషన్లకు లేఖలు రాస్తాం. ఈ పాలసీ కింద ఎవరైనా డబ్బులు చెల్లిస్తే నష్టపోతారు’’ అని కేటీఆర్ వెల్లడించారు.
యూఏఈలో బతుకమ్మ సంబరాలకు కేటీఆర్కు ఆహ్వానం
ఈనాడు, హైదరాబాద్: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ)లో నిర్వహించనున్న బతుకమ్మ సంబరాలకు ముఖ్యఅతిథిగా హాజరుకావాలని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్కు ఆహ్వానం అందింది. ఈ మేరకు ఎమిరేట్స్ తెలంగాణ కల్చరల్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఈటీసీఏ-యూఏఈ) ప్రతినిధులు హైదరాబాద్ నందినగర్లోని కేటీఆర్ నివాసంలో ఆయనను కలిసి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా బతుకమ్మ వేడుకలకు సంబంధించిన పోస్టర్ను కేటీఆర్ చేతుల మీదుగా విడుదల చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్