ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు టీమార్స్
టీజీసీఎస్బీ.. ఈగల్ తరహాలో త్వరలోనే సరికొత్త బ్యూరో 900 మంది పోలీసులతో రోడ్డు భద్రతకు ప్రాధాన్యం ట్రాఫిక్ చలానాల్లో 50% నిధులు కేటాయించే అవకాశం ప్రభుత్వానికి చేరిన ప్రతిపాదనలు.
Traffic


హైదరాబాద్, 09 ఆగస్టు (హి.స.) సైబర్ నేరాల నియంత్రణకు టీజీసీఎస్బీ.. మాదకద్రవ్యాల కట్టడికి ఈగల్.. ఇప్పుడు ఈ కోవలోనే తెలంగాణలో మరో సరికొత్త విభాగం ట్రాఫిక్ మేనేజ్మెంట్ అండ్ రోడ్ సేఫ్టీ బ్యూరో(టీమార్స్) అందుబాటులోకి రాబోతోంది. ట్రాఫిక్ ఇక్కట్ల పరిష్కారం కోసం పోలీస్ ఉన్నతాధికారుల మేధోమథనం నుంచి ఈ విభాగం రూపుదిద్దుకొంది. ఇప్పటివరకు రాష్ట్రంలో ట్రాఫిక్ విభాగాలు ఏ పోలీస్ యూనిట్కవే ప్రత్యేకంగా ఉన్నాయే తప్ప రాష్ట్రమంతటా ఏకరూపత లేదు. టీజీసీఎస్బీ, ఈగల్ మాదిరిగా రాష్ట్ర స్థాయి నుంచి పర్యవేక్షణా లేదు. రాజధాని ప్రాంతంలో తరచూ ట్రాఫిక్ ఇక్కట్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్న క్రమంలో సీఎం రేవంత్రెడ్డి సైతం తన వాహనశ్రేణికి ట్రాఫిక్ విభాగం ఇచ్చే గ్రీన్ఛానల్ సదుపాయాన్ని వీలైనంత తక్కువ సమయానికి కుదించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ఏటా సుమారు 7 వేల మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే రోడ్డు భద్రతతోపాటు ట్రాఫిక్ ఇక్కట్ల పరిష్కారం దిశగా పోలీస్ ఉన్నతాధికారులు కొత్త బ్యూరోను ప్రతిపాదించారు. ప్రభుత్వం వద్దకు చేరిన ప్రతిపాదనల దస్త్రానికి ఆమోదం లభిస్తే ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి దోహదమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

నిధుల సమీకరణకు కీలక ప్రతిపాదన

ఉల్లంఘనలకు పాల్పడిన వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చలానాలను విధిస్తుండగా... మరోపక్క సిగ్నళ్లు సక్రమంగా పనిచేయకపోవడం.. జీబ్రా క్రాసింగ్లు, స్టాప్ లైన్లు తరచూ చెరిగిపోవడం.. గుంతల రోడ్లు తదితర ఇబ్బందులతో వారు విమర్శలు ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి మున్సిపల్, ఆర్అండ్బీ శాఖల మధ్య సమన్వయ లోపం ఇందుకు ప్రధాన కారణం. కొత్త బ్యూరోను నెలకొల్పే క్రమంలో నిధుల సమీకరణకు ఉన్నతాధికారులు ప్రాధాన్యమిచ్చారు. ఏటా రూ.400 కోట్ల నుంచి రూ.600 కోట్ల మేర ట్రాఫిక్ చలానాల రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుండగా అందులో ఒక్క రూపాయి కూడా ట్రాఫిక్ పోలీస్ విభాగానికి రావడంలేదు. ఇకపై ఇందులో 50% మేర ట్రాఫిక్ విభాగానికి కేటాయించాలని ప్రతిపాదించారు.

అదనపు డీజీపీ లేదా ఐజీ నేతృత్వం

కొత్త బ్యూరో అదనపు డీజీపీ లేదా ఐజీ నేతృత్వంలో ఏర్పాటు కానుంది. రాష్ట్రవ్యాప్తంగా 900 మంది సిబ్బందికి ప్రత్యేకంగా ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతల్ని అప్పగించనున్నారు. ఇటీవలే గ్రేహౌండ్స్, ఆక్టోపస్ల నుంచి వెనక్కి రప్పించిన సిబ్బందిని కొత్త విభాగానికి కేటాయించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / రాశి భాగాయత్


 rajesh pande