
హైదరాబాద్, 17 సెప్టెంబర్ (హి.స.)
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని (Wage Ceiling Limit) నెలకు ₹15,000 నుండి ₹25,000 కు పెంచుతూ కేంద్ర క్యాబినెట్ చారిత్రక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిన ఈ చారిత్రక బిల్లుకు ఆమోదం లభించింది. దేశంలో గత పన్నెండేళ్లుగా (సెప్టెంబర్ 2014 నుండి) ఈ పరిమితి ₹15,000 గానే ఉంది. మారిన ఆర్థిక పరిస్థితులు, జీతాల పెరుగుదల మరియు ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ వేతన పరిమితిని సవరించాలని సుప్రీంకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం ఈ ముందడుగు వేసింది. ఈ కొత్త నిబంధనలు విష్వకర్మ జయంతి సందర్భంగా అధికారికంగా అమలులోకి వచ్చాయి.
ఈ వేతన పరిమితి పెంపు వల్ల దేశవ్యాప్తంగా సుమారు 51 లక్షల మందికి పైగా అదనపు ప్రైవేట్ రంగ ఉద్యోగులు విధిగా ఈపీఎఫ్ (EPF) సామాజిక భద్రతా పరిధిలోకి రానున్నారు. ప్రస్తుతం బేసిక్ జీతం ₹15,000 కంటే ఎక్కువ ఉన్న కొత్త ఉద్యోగులకు పీఎఫ్ ఆటోమేటిక్ విలీనం వర్తించదు. కానీ కొత్త నిబంధనల ప్రకారం, నెలకు ₹25,000 లోపు బేసిక్ వేతనం ఉన్న ప్రతి ఒక్కరికీ పీఎఫ్, ఈపీఎస్ పెన్షన్ మరియు బీమా ప్రయోజనాలు తప్పనిసరి అవుతాయి.
ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల జీవితాలపై మరియు కంపెనీల బడ్జెట్‌పై స్పష్టమైన ప్రభావం పడనుంది. దీని ద్వారా ఉద్యోగుల బేసిక్ జీతం నుండి ప్రతి నెలా పీఎఫ్ ఖాతాకు కట్ అయ్యే మొత్తం పెరుగుతుంది, దీంతో చేతికి వచ్చే జీతం (Take-Home Salary) స్వల్పంగా తగ్గే అవకాశం ఉంది. అయితే, దీనికి సమానంగా కంపెనీ (Employer) కూడా 12% వాటాను జమ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగుల పీఎఫ్ ఖాతాలలో ఎక్కువ మొత్తం జమ అవ్వడం వల్ల, వారు పదవీ విరమణ పొందే సమయానికి భారీ రిటైర్మెంట్ కార్పస్ (పెద్ద మొత్తంలో సొమ్ము) సమకూరుతుంది. అంతేకాకుండా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (EPS) కింద భవిష్యత్తులో వచ్చే నెలవారీ పెన్షన్ కూడా గణనీయంగా పెరుగుతుంది. అదే సమయంలో ప్రైవేట్ సంస్థలపై అదనపు ఆర్థిక భారం పడనుండగా, ప్రభుత్వంపై కూడా ఏటా సుమారు ₹11,339 కోట్ల వరకు అదనపు భారం పడుతుందని అంచనా. వ్యవస్థీకృత కార్మిక రంగాన్ని బలోపేతం చేయడంలో ఇదొక మైలురాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / Santhosha Laxmi