
తెలంగాణ , 17 సెప్టెంబర్ (హి.స.)నగరంలో రెసిడెన్షియల్ టౌన్ షిప్ నకు అనుసంధానం చేస్తూ స్కైవాక్ నిర్మించబోతున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి పక్కనే 3,576 ఫ్లాట్లతో నిర్మితమవుతున్న వాసవి ఆనంద గేటెడ్ కమ్యూనిటీకి నేరుగా చేరుకునేందుకు వీలుగా నిర్మించే స్కైవాక్ నిర్మాణానికి చట్టబద్ధ అనుమతులు లభించాయని వాసవి గ్రూప్ సీఎండీ యొర్రం విజయ్ కుమార్ పేర్కొన్నారు. అంతేకాదు ట్రాఫిక్ పోలీసుల నుంచి ఎన్ వోసీ వచ్చిందని, ట్రాఫిక్ మళ్లింపులు, బారికేడింగ్ తర్వాత పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. స్కైవాక్ వాసవి ఎవెన్యూస్ ఎల్ ఎల్ పీ, ఎస్ ఆర్ ఇన్ ఫ్రా అండ్ డెవలపర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయని తెలిపారు.
ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోతో కుదిరిన ఒప్పందం ప్రకారం 6 నెలల్లో స్కైవాక్ ను పూర్తి చేయాల్సి ఉంది. అయితే రూ.15 కోట్లతో చేపట్టే ఈ స్కైవాక్ ను ఐఐటీ హైదరాబాద్ డిజైన్ చేసింది. సెంట్రల్ మీడియన్ నుంచి 14.5 మీటర్ల దూరంలో, నేషనల్ హైవే-65కు ఆనుకుని ఉన్న కాలిబాటల వరకు నిర్మిస్తారు. ఇందులో 10 ప్రధాన స్తంభాలు ఉంటాయి. ఒక్కో స్తంభం 5.94 మీటర్ల వ్యాసం, 8.64 మీటర్లతో ఎత్తుతో 12-14 మీటర్ల దూరంలో నిర్మిస్తారు. దీన్ని ఫ్యూచర్ లో కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా డిజైన్ చేశారు. స్కైవాక్ లో ర్యాంప్ , లిఫ్ట్ సదుపాయంతో పాటు మెట్లు ఉంటాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్