
హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అసెంబ్లీలో ఈ ఏడాది వర్షపాతం పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటి నిల్వలపై మాట్లాడారు. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్రంలో 543 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణంగా ఈ కాలంలో 640 మిల్లీమీటర్ల వర్షపాతం ఉండాల్సి ఉంటుందని తెలిపారు. జూన్లో 12 శాతం, జూలైలో ఒక శాతం, ఆగస్టులో 38 శాతం లోటు నమోదైందని వివరించారు.
ఒకటి రెండు రోజులు భారీ వర్షాలు కురిసినా గతంలో ఏర్పడిన దీర్ఘకాలిక వర్షాభావ పరిస్థితులను పూర్తిగా భర్తీ చేయలేవని ప్రభుత్వం పేర్కొంది. నీటి లభ్యతను బట్టి సాగునీటి కంటే తాగునీటి అవసరాలను ముందుగా తీర్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ పరిస్థితి వ్యవసాయ రంగంపైనా ప్రభావం చూపుతోంది. ఈ ఖరీఫ్ సీజన్లో సుమారు 123.74 లక్షల ఎకరాల్లో సాగు నమోదైందని, గత ఏడాది ఇదే సమయంలో 139.29 లక్షల ఎకరాల్లో సాగు జరిగిందని ప్రభుత్వం తెలిపింది. వరి సాగు కూడా సుమారు 18 శాతం తగ్గినట్లు వివరించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్