
హైదరాబాద్ , 19 సెప్టెంబర్ (హి.స.)తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలను మరింత విస్తరించే దిశగా ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పోస్ట్గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థులకు మూడు నుంచి ఆరు నెలల రోబోటిక్ సర్జరీ శిక్షణను తప్పనిసరి చేసే ప్రతిపాదన పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం వెల్లడించింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక శస్త్రచికిత్సా విధానాలను విస్తరించేందుకు అవసరమైన నిపుణుల సంఖ్యను పెంచడం ఈ ప్రణాళిక ఉద్దేశంగా ఉంది. రోబోటిక్ వ్యవస్థను సమర్థంగా వినియోగించేందుకు ప్రత్యేక శిక్షణ అవసరం. ప్రస్తుతం ప్రభుత్వ రంగంలో ఈ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించాలంటే శిక్షణ పొందిన వైద్యులు, సాంకేతిక నిపుణులు, నిర్వహణ సిబ్బంది అవసరం ఉంటుంది.
ప్రభుత్వ వైద్య విద్యా సంస్థల్లో చదువుతున్న పీజీ వైద్యులకు శిక్షణ అందించడం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోబోటిక్ శస్త్రచికిత్సలను నిర్వహించగల వైద్యుల బృందాన్ని తయారు చేయవచ్చని ఆరోగ్య శాఖ భావిస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / పుట్టా సుమన్